Mani Ratnam: సినిమా ఎలా తీసినా అందులో ఒక విభిన్నమైన మార్క్ చూపించడంలో దర్శకరత్నం మణిరత్నానికి మరెవరూ సాటిరారు. ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి మదిని దోచే ప్రేమకథలైనా, ‘దళపతి’, ‘నాయకన్’ లాంటి గ్యాంగ్‌స్టర్ కథలైనా, ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి పౌరాణిక కావ్యాలైనా ఆయన చేతిలో పడితే తెరపై ఒక అద్భుతంలా మెరిసిపోతాయి.
అయితే, ప్రతిసారి అద్భుతాలు జరగవు కదా! భారీ అంచనాలు, వందల కోట్ల బడ్జెట్‌తో కమల్ హాసన్‌తో తీసిన ‘థగ్ లైఫ్’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో, మళ్లీ తనకి అత్యంత ఇష్టమైన, తక్కువ బడ్జెట్లో మనసుకు హత్తుకునే సున్నితమైన లవ్ స్టోరీ వైపు మణిరత్నం అడుగులు వేశారు. ఈసారి ఆయన నమ్ముకున్న జంట — ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఇంకా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి!
ఎలాంటి ఆర్బాటం లేకుండా ఈ సినిమా షూటింగ్ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ప్రారంభమైంది. హౌరా బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో వీళ్లిద్దరిపై ఒక అందమైన లవ్ సాంగ్ ని షూట్ చేశారు. అనుకోకుండా ఈ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలోకి లీక్ అవ్వడంతో ఒక్కసారిగా నెటిజన్ల దృష్టి దీనిపై పడింది.
లీక్ అయిన ఫొటోల్లో విజయ్ సేతుపతిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు! ఎప్పుడూ గడ్డం, మీసాలతో కాస్త రఫ్‌గా కనిపించే సేతుపతి.. క్లీన్ షేవ్ చేసుకుని, నల్లటి టీషర్ట్, జీన్స్‌లో చాలా యంగ్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. ఆయన లుక్ చూస్తుంటే ’96’ సినిమా లేదా ‘ఓకే బంగారం’ రోజులు గుర్తుకొస్తున్నాయని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరోవైపు సాయిపల్లవి గోధుమ రంగు డ్రెస్‌లో ఎంతో నాచురల్‌గా, పక్కింటి అమ్మాయిలా మెరిసిపోతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాయి పల్లవిని చూడగానే ‘శ్యామ్ సింగ రాయ్’ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని తెలుగు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిన్న, మధురమైన ప్రేమకథ మళ్లీ పాత మణిరత్నాన్ని మనకు గుర్తుచేస్తుందని సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
