crime news

UP News: ఇది ఎవరి చేసిన పాపం.. డీజే సౌండ్‌కు ఓ చిన్నారి మృతి!

UP News: పండుగలు, ఊరేగింపుల పేరిట రోడ్లపై హోరెత్తించే డీజే (DJ) సౌండ్లు మరో పసికందు ప్రాణాన్ని బలిగొన్నాయి. చెవులతుప్పులు వదిలేలా, గుండెలు అదిరిపోయేలా పెడుతున్న డీజేల తీవ్రతకు తరగతి గదిలోనే పాఠాలు వింటున్న ఓ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, వైద్యుల హెచ్చరికలను గాలికొదిలేసి కొందరు చేస్తున్న అత్యుత్సాహం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహావేశాలను నింపింది.

క్లాస్‌రూమ్‌లో పాఠాలు వింటూనే కుప్పకూలిన చిన్నారి..

బలరాంపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వైష్ణవి మిశ్రా అనే విద్యార్థిని 2వ తరగతి చదువుతోంది. పాఠశాల సమయం నడుస్తుండగా సమీపంలోని ప్రధాన రోడ్డు గుండా వినాయక నిమజ్జన ఊరేగింపు పెద్ద ఎత్తున డీజే శబ్దాలతో సాగింది. డీజే నుంచి వచ్చిన కర్ణకఠోరమైన శబ్దాలు, భూమి అదిరిపోయే వైబ్రేషన్లను క్లాస్‌రూమ్‌లో కూర్చున్న చిన్నారి తట్టుకోలేకపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై బెంచ్‌పైనే స్పృహతప్పి పడిపోయింది.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సదరు విద్యార్థిని బెంచ్‌పై కూర్చుని ఉండగానే శబ్దాల తీవ్రతకు మూడుసార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
గుండెపోటుతోనే మృతి – వైద్యుల నిర్ధారణ..
బలరాంపూర్ జిల్లా మెమోరియల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ గిరిధర్ చౌహాన్ మాట్లాడుతూ.. పరిమితికి మించిన శబ్దాలు, విపరీతమైన వైబ్రేషన్లు పిల్లలు, వృద్ధుల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ఆ తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక గుండె ఆగిపోవడం (హార్ట్ ఎటాక్) వల్లే చిన్నారి మరణించి ఉండవచ్చని స్పష్టం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న బలరాంపూర్ సిటీ సర్కిల్ ఆఫీసర్ (CO) అభిషేక్ సింగ్.. చిన్నారి మృతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నా పట్టించుకోని వైనం..
ఊరేగింపులు, పండుగల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేల వాడకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు, డెసిబుల్ పరిమితులను విధించినప్పటికీ అధికారులు, నిర్వాహకులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు తమ హంగామా కోసం, ప్రచార యావ కోసం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడుతున్నారు. నిమజ్జనాల్లో, బహిరంగ ర్యాలీల్లో డీజేల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *