తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్ తేదీలను టీటీడీ వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు అక్టోబరు 24వ తేదీ ఉ.10 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు 19 నుంచి 21 వరకు ఆర్జిత సేవా టికెట్లు, అక్టోబరు 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అక్టోబరు 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కానున్నాయి. అక్టోబరు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.
వైకుంఠ ద్వారా దర్శనాలు 10 రోజుల పాటు సాగనున్న నేపథ్యంలో…. ఆ పదిరోజుల టికెట్లను టీటీడీ మరో ప్రత్యేక దినంలో విడుదల చేయనుంది. జనవరి 10వ తేది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు జరుగనున్నాయి. 10 వ తేది నుంచి 19 వ తేది వరకు వైకుంఠ ద్వారాలలో ప్రవేశించి భక్తులు స్వామివారిని దర్శించి భాగ్యం ఉంటుంది. ఈ 10 రోజుల కోటను టీటీడీ ప్రత్యేక తేదీలో విడుదల చేయనుంది.
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.