Jagtial: ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంట.. పెళ్లైన నెల రోజుల్లోపే లోకాన్ని వీడిన విషాద ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దసరా పండుగ రోజున భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆమె చనిపోయిందన్న తీవ్ర మనస్తాపంతో భర్త దీపావళి రోజున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన సంతోష్ (25), అదే గ్రామానికి చెందిన గంగోత్రి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి సెప్టెంబర్ 26న వారి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వారి జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. దసరా పండుగ (అక్టోబర్ 2న) సందర్భంగా సంతోష్, గంగోత్రి తమ అత్తగారింటికి వెళ్లారు.అక్కడ భోజనం చేసే సమయంలో మాంసం కూరలో కారం ఎక్కువగా ఉందనే చిన్న విషయంలో సంతోష్, గంగోత్రిని మందలించారు.
Also Read: Pawan Angry on DSP: ఒక ఏఎస్పీ, ఒక డీఎస్పీ.. ఒకే రోజు టార్గెట్!
భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి, అదే రోజు రాత్రి అత్తారింట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కారణంగానే ప్రేమించిన భార్య చనిపోయిందన్న మనోవేదన సంతోష్‌ను వెంటాడింది. అప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయిన సంతోష్, వారం రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన అక్క ఇంటికి వెళ్లాడు. తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్, సరిగ్గా దీపావళి పండుగ రోజునే (మంగళవారం, అక్టోబర్ 21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే, అదీ పండుగ రోజుల్లోనే ఈ యువ దంపతులు బలవన్మరణానికి పాల్పడటం ఎర్దండి గ్రామంలోనూ, వారి కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. ఈ చిన్నారి గొడవే ఇంతటి విషాదానికి దారి తీయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.