Navratri Day 2: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఈ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదాలకే మూలమైన ఈ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
గాయత్రీ దేవి విశిష్టత
గాయత్రీ దేవి సకల వేద స్వరూపిణి. ఆమె ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలను ధరించి కనిపిస్తుంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం లభిస్తాయని పండితులు చెబుతారు. అంతేకాకుండా, ఈ మంత్ర జపం చేస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం వస్తుందని నమ్ముతారు. ఆది శంకరాచార్యులు కూడా గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా కొలిచారు.
దసరా ఉత్సవాల మొదటి రోజు నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ముఖ్యంగా, శ్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల మహిళల రద్దీ బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మొదటి రోజు ఏకంగా 75,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
* దర్శన టికెట్లు: ఈ 11 రోజుల పాటు 500 రూపాయల టికెట్లను రద్దు చేశారు. ప్రస్తుతం 100, 300 రూపాయల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
* వీఐపీ దర్శనాలు: వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించారు.
* వృద్ధులు, వికలాంగులు: మధ్యాహ్నం 4 గంటల నుంచి వృద్ధులకు, వికలాంగులకు దర్శనం కల్పిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీళ్ళు, మజ్జిగ, పాలు ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.