Tirumala Brahmotsavam 2025: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి (సెప్టెంబర్ 24) నుంచి అతి వైభవంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసి, తిరుమల కొండంతా ఉత్సవమయంగా మారిపోయింది.
అంకురార్పణతో ఆరంభం
మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం, శ్రీ విష్వక్సేనులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. విత్తనం మొలకెత్తడాన్ని సూచించే ఈ ఘట్టం, ఉత్సవాలు విజయవంతం కావాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇది కూడా చదవండి: Manchu Manoj: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను కలిసిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్
వాహన సేవల ప్రత్యేకతలు
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
-
సెప్టెంబర్ 24: సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం
-
సెప్టెంబర్ 25: ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం
-
సెప్టెంబర్ 26: సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
-
సెప్టెంబర్ 27: కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం
-
సెప్టెంబర్ 28: ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ సేవ
-
సెప్టెంబర్ 29: హనుమంత వాహనం, స్వర్ణ రథం, గజ వాహనం
-
సెప్టెంబర్ 30: సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు
-
అక్టోబర్ 1: రథోత్సవం, అశ్వ వాహనం
-
అక్టోబర్ 2: చక్రస్నానం, ధ్వజావరోహణం
ప్రత్యేకంగా గరుడ సేవ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంలో చెన్నై నుంచి సంప్రదాయంగా గొడుగుల ఊరేగింపు తిరుమలకు చేరుకుంటుంది. ఈ గొడుగుల సమర్పణలో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వవద్దని, అవి టీటీడీకి చేరవని అధికారులు స్పష్టం చేశారు.
భక్తులకు విజ్ఞప్తి
ఉత్సవాల సమయంలో తిరుమల కొండంతా భక్తుల సందోహంతో కళకళలాడనుంది. టీటీడీ, భక్తులు నిబంధనలు పాటించి, క్రమశిక్షణతో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుతోంది.