Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల శేషాచల కొండల్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి పాదాలు, శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు ఫైరింజన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ఈ ఘటనలో సుమారు 100 మీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అగ్నిప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
Also Read: Danam nagendar: మంత్రివర్గం దేశానికే ఆదర్శం
Tirumala: తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం జరిగిన శ్రీవారి పాదాల ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల కొండపై మొట్టమొదట అడుగు పెట్టిన ప్రదేశం ఇదేనని భక్తులు నమ్ముతారు. స్వామివారి పాదముద్రలు ఇక్కడ సజీవ సాక్ష్యంగా ఉన్నాయని విశ్వసిస్తారు. అలిపిరితో పాటు శ్రీవారి పాదాల మీదుగా కూడా భక్తులు నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు. ప్రకృతి అందాలను వీక్షించడంతో పాటు, స్వామివారి పాదాలను స్పృశించి తక్కువ సమయంలోనే ఆలయానికి చేరుకోవచ్చని చాలా మంది భక్తులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. టీటీడీ ఉచిత బస్సులు, ప్రైవేట్ టాక్సీలు, ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా కూడా భక్తులు శ్రీవారి పాదాల వద్దకు చేరుకోవచ్చు.
గతంలో లడ్డూ కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అగ్నిప్రమాదాలు జరగకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
దాదాపు వంద మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని తెలిపిన అధికారులు pic.twitter.com/IaV98hwuTR
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025