ఒకరి ముందు చేయి చాచడం అంటే మానసికంగా ఎంతో చచ్చిపోవాల్సిందే. సాధారణంగా మనం రోజూ రోడ్డు మీద బిచ్చగాళ్లను చూస్తాం. వారిని చూసి జాలిపడతాం. ఒక్కోసారి కొంతమందిని చూస్తే మనసు వికలము అవుతుంది. వీళ్లెలా బ్రతుకుతున్నారో అంటూ మనలో మనమే బాధపడటం. చేతనైతే కొంత చిల్లర వారికి ఇస్తాం. లేకపోతే వారి మీద జాలిపడటం తప్ప ఏమీ చేయలేక ముందుకు పోతాం. ఇది సరే.. ఒక బిచ్చగాడు రోజుకు చేయి చాపి రోడ్డుమీద కూచుంటే ఎంత సంపాదించగలడు? ఈ లెక్క ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించినా.. ఆ ఏముందిలే పాపం అందరూ ఇస్తారా ఏమిటి? మహా అయితే, ఓ వందా.. రెండొందలు వస్తాయేమో.. అదీ కూడా రోజు బావుంటే అని అనుకుంటాం కదా.
కానీ ఈ వార్త చదివితే యాచించడం చాలా లాభదాయకంగా ఉంటుందని మీరు కచ్చితంగా నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు భరత్ జైన్. ముంబైలోని జైన్ వయసు 54 ఏళ్లు, 40 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ (CSMT) లేదా ఆజాద్ మైదాన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలలో ఇతను అడుక్కునేవాడు.
ఇతను రోజుకు 10 నుండి 12 గంటలు పని చేస్తూ రోజుకు రూ.2,000 నుండి 2,500 వేల వరకు సంపాదిస్తాడు. అన్నట్టు ఇతను తన వృత్తిలో ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా ఇష్టపడి చేస్తున్నాడట. ఇక ఇతని ఆస్తుల లెక్కలు చూస్తే.. మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.
జైన్ ముంబైలోని పరేల్‌లో 2BHK ఫ్లాట్‌ని కలిగి ఉన్నాడు. దీని ధర జస్ట్ రూ. 1.2 కోట్లు. అతను తన భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు.
ఇప్పుడు కూడా అనుకోగలమా చెప్పండి.. అడుక్కునే వారంతా నిజంగా లేనివారే అని!

