Rishab Shetty: కన్నడ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన చిత్రాల్లో ‘కాంతార: చాప్టర్ 1’ ఒకటి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్గా నటించిన ఈ లేటెస్ట్ మూవీ అక్టోబర్ 2న విడుదలై రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసింది.
‘కాంతార: చాప్టర్ 1’ ఘన విజయం సాధించడంతో, రిషబ్ శెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తన విజయ రహస్యం గురించి, అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు.
“నా అసలు పేరు ప్రశాంత్” అని రిషబ్ శెట్టి తెలిపారు. అయితే, సినిమా రంగంలో అదృష్టం, విజయం చేకూరడం కోసం తన తండ్రి సలహా మేరకు పేరును ‘రిషబ్ శెట్టి’గా మార్చుకున్నానని ఆయన చెప్పారు. రిషబ్ తండ్రి పెద్ద జ్యోతిష్యుడు కావడంతో, ఆయన జాతకాన్ని పరిశీలించి ‘రిషబ్’ అని పేరు మార్చుకోవాలని సూచించారట.
పేరు మారగానే లైఫ్ మారింది!
పేరు మార్చుకున్న తర్వాతే తన జీవితం పూర్తిగా మారిపోయిందని రిషబ్ శెట్టి నమ్మకంగా వెల్లడించారు. “మొదట్లో నేను కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ నా పేరు మారిన తర్వాత నా అదృష్టం కలిసివచ్చి, లైఫ్ కొంచెం కొంచెంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా, ‘కాంతార’ (Kantara) సినిమాతో నాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: YSRCP Truth Bomb: మైసూర్ బజ్జీలో మైసూర్, వైసీపీ ట్రూత్ బాంబ్‌లో ట్రూత్!
సినిమాకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలు, దైవ కోల/భూత కోల సంప్రదాయం, రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం అన్ని భాషల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా, 8వ శతాబ్దంలో కదంబుల పాలనలో జరిగే ఈ కథ… ఈశ్వరుడి పూదోట, దైవిక భూమి ‘కాంతార’ను కాపాడుకునేందుకు గిరిజన తెగ నాయకుడు బెర్మే (రిషబ్ శెట్టి) చేసిన పోరాటం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.
‘కాంతార: చాప్టర్ 1’ రూపంలో దక్కిన ఈ అద్భుత విజయం వెనుక… రిషబ్ శెట్టి ప్రతిభ, కృషి ఎంత ఉన్నా, ఆయన తండ్రి సూచన మేరకు మార్చుకున్న పేరులోని జ్యోతిష్య బలం కూడా కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ సినిమా రిషబ్ శెట్టి కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది.