Telangana: పదివేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు.. ప్రభుత్వాన్ని అడిగీ అడిగీ విసిగి వేసారిన కాలేజీల యాజమాన్యాలు.. ఇక లాభం లేదనుకుని సెప్టెంబర్ 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్‌కు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య (ఎఫ్ఏటీహెచ్ఈఐ) నిర్ణయం తీసుకున్నది. ఈ దశలోనే నిన్న రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమాఖ్య జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సర్కారు ఏదీ తేల్చకపోవడంతో కాలేజీల బంద్‌కే ఎఫ్ఏటీహెచ్ఈఐ మొగ్గుచూపినట్టు సమాచారం.
Telangana: కాలేజీల బంద్ అంటూ అకస్మాత్తుగా ప్రకటిస్తే ఎలా? ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. కొంత ఆలస్యమైనా బకాయిలు అందజేస్తాం. కాస్త ఓపిక పట్టండి. లేదంటే మీకే నష్టం అంటూ భట్టి విక్రమార్క ప్రభుత్వం వైఖరిని కరాఖండిగా తేల్చి చెప్పారు. అసలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, దసరాలోగా ఇస్తారా? సోమవారం (సెప్టెంబర్ 15) లోగా ఎన్ని నిధులు ఇస్తారు? అంటూ కళాశాలల యాజమాన్యాలు భట్టిని కోరాయి. అయినా తాను ఢిల్లీ వెళ్తున్నానని, వచ్చాక మాట్లాడుదామంటూ చెప్పి వెళ్లిపోయారని తెలిసింది.
Telangana: ఈ దశలో కళాశాలల బంద్‌పై అయోమయం నెలకొన్నది. సెప్టెంబర్ 15 నుంచి కొన్ని కోర్సుల సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో బంద్ పాటిస్తే పరీక్షలు నిలిచిపోనున్నాయి. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొన్నది. అసలు పరీక్షలు నడుస్తాయా? లేదా? సంశయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.
Telangana: ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య (ఎఫ్ఏటీహెచ్ఈఐ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆదివారం సాయంత్రం తేలనున్నది. ఎఫ్ఏటీహెచ్ఈఐ ప్రతినిధులు తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. ఒకవేళ బంద్ పాటిస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 కళాశాలలు బంద్ పాటించనున్నాయి.