Siddipet: సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో ఓ యువకుడి ప్రకటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన శివాని ఆరో వార్డు సభ్యురాలిగా పోటీలో ఉన్నారు. ఆమె భర్త శ్రీకాంత్… తన భార్యను గెలిపిస్తే ఐదేళ్లపాటు ఓ వ్యక్తి ఉచితంగా కటింగ్ , షేవింగ్ చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. ఆమె భర్త వృత్తిరీత్యా కటింగ్ షాపు యజమానిగా ఉన్నారు. తమ వార్డు ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని… వార్డుకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే ఈ యువ దంపతులు ఎన్నికల నిర్ణయం తీసుకున్నామన్నారు. శివానిని గెలిపిస్తే తప్పకుండా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వృత్తిని, ఎన్నికల ప్రచారాన్ని ముడిపెడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు శ్రీకాంత్ వేసిన ఈ వినూత్న అస్త్రంపై గ్రామస్థులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Also Read: Putin India Visit: పుతిన్ పర్యటన: భారత్-రష్యా బంధానికి కొత్త బలం!
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ కొందరు యువకులు చేస్తున్న ప్రచారం స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ యువత వారి ఇంటి ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ‘ఓటు.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఆ ఓటుని మేము అమ్ముకోము. మా ఓటు విలువైనది.. అమ్మబడదు’’ అని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

