ICET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది.
ఈ పరీక్షకు మొత్తం 71,746 మంది దరఖాస్తు చేసుకోగా, 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,985 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.83గా నమోదైంది. ఉత్తీర్ణత సాధించినవారిలో 30,989 మంది అమ్మాయిలు, 27,998 మంది అబ్బాయిలు ఉన్నారు. కనీసం 25 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
ఫలితాలు తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, జన్మతేది వంటి వివరాలను నమోదు చేసి, అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల లింక్‌లు ఇవే:
TS ICET 2025 ఫలితాల అధికారిక వెబ్సైట్:
https://icet.tgche.ac.in
అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డ్‌ను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి టాపర్ల జాబితాలో అబ్బాయిలే ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన క్రాంతి కుమార్ 179.93 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన సాయికృష్ణ 155.17 మార్కులతో రెండవ స్థానం సాధించాడు. మహబూబాబాద్‌కు చెందిన కౌశిక్ మూడో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన కృష్ణ వర్ధన్ నాలుగో ర్యాంక్, జగిత్యాల జిల్లా వైష్ణవి టాప్-5లో స్థానం దక్కించుకున్నారు.