High Court: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ర్యాంకులపై నెలకొన్న వివాదంలో టీజీపీఎస్సీకి పెద్ద ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం నిలిపివేసింది. దీంతో ర్యాంకర్లకు తాత్కాలికంగా ఉపశమనం కలిగింది.
సుప్రీం స్థాయి ఉద్యోగాల కోసం 14 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ పరీక్షలలో ర్యాంకింగ్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 9న సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దు చేస్తూ, రీవాల్యూయేషన్ లేదా అవసరమైతే రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించింది. దీనికి ఎనిమిది నెలల గడువునూ విధించింది. ఈ తీర్పు కారణంగా ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం
తాజాగా విచారణలో అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ – “గ్రూప్-1 నియమావళిలో రీవాల్యూయేషన్ అనే నిబంధన అసలు లేదు. కేవలం రీకౌంటింగ్‌కే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధం” అని డివిజన్ బెంచ్‌కు వివరించారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ, రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని కూడా చెప్పింది. ఈ కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 15వ తేదీకి వాయిదా పడింది.