BC Reservations

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టుకి తెలంగాణ ప్రభుత్వం..

BC Reservations: బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల జారీ చేసిన స్టే ఆర్డర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 9, 41, 42లను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే.

తాజాగా హైకోర్టు ఆదేశాల కాపీ అందుకున్న ప్రభుత్వం, వాటిని విపులంగా అధ్యయనం చేసిన అనంతరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ లీగల్ టీంతో సమావేశమై, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించినట్లు తెలుస్తోంది.

సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే వంటి వారిని ఈ కేసులో వాదనల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. సోమవారం నాటికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వం వాదన ప్రకారం, సుప్రీంకోర్టు పూర్వపు తీర్పులకు అనుగుణంగా బీసీ జనాభాపై సర్వే నిర్వహించారని, రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉండడంతో 42% రిజర్వేషన్‌లు ఇవ్వడం న్యాయసమ్మతమని పేర్కొననుంది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్ పరిమితిని సవరించే చట్టం కూడా తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.

ఇది కూడా చదవండి: Tennessee Explosion: అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు.. 19 మంది మృతి

ఇకపోతే, బీసీ రిజర్వేషన్ జీఓ 9పై పిటిషన్ దాఖలు చేసిన బీ. మాధవరెడ్డి తదితరులు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు.

హైకోర్టు, ట్రిపుల్ టెస్ట్ విధానం పాటించకపోవడం పై ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొంటూ వికాస్ కృష్ణ రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల తీర్పులను పరిగణలోకి తీసుకుంది.

హైకోర్టు ఈ వ్యవహారంపై తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. అంతవరకు రిజర్వేషన్ జీఓలు అమల్లో ఉండవు.

ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు జోక్యం తగదని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను ఆపేస్తోందని, అందుకే తక్షణమే స్టే ఎత్తివేయాలని కోరనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *