Damagundam radar centre: నెలలుగా ఆందోళనలు, అభ్యంతరాల నడుమ దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది . నిరసనలను బేఖాతరు చేస్తూ ఈ నెల 15న కేంద్రం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారని చెబుతున్నారు . ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రాజెక్టు నిర్వాహకులు ఆహ్వాన పత్రాలను అందజేస్తున్నారు. దీంతో స్థానికులు, పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నదని మండిపడుతున్నారు.
Damagundam radar centre: వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని దామగుండం దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న నేవీ రాడార్ కేంద్రం 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్థానిక తండాలు, గ్రామాలతోపాటు జిల్లా వాసులు, పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాల నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో అప్పటి నుంచి వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.
దామగుండం అటవీ ప్రాంతంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం
Damagundam radar centre: దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 400 ఏండ్లనాటి చారిత్రక నేపథ్యమున్న దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం కనుమరుగు అవుతుందని ఆధ్యాత్మికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్న ఎంతో విలువైన లక్షలాది ఔషధ మొక్కలు అంతరించిపోతాయని పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు అక్కడి గిరిజనులు నిరాశ్రయులు అవుతారని, ఆ ప్రాంతంలో ఆవాసముండే జంతుజాలాలకు ముప్పు వాటిల్లుతుందని అందరూ ఆందోళన చెందుతున్నారు.
Damagundam radar centre: రాడార్ రేడియేషన్ ప్రభావంతో భావితరాలకూ తీరని ముప్పు ఏర్పడుతుందని భావిస్తున్నారు. మానసిక, శారీరక రుగ్మతలకు వారంతా లోనయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అందుకే వివిధ వర్గాలు దీర్ఘకాలంగా రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే కేంద్రం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ఇటు పోలీసులు, అధికారులు, అటు ఆందోళనకారుల నిరసనలు ఏ తీరుకు దారితీస్తుందోననే అంతటా ఉత్కంఠ నెలకొన్నది.