Telangana: ఆరుగాలం కష్టించి పంట పండిస్తాడు రైతు. అలాంటి పంట దిగుబడులను కాపాడుకునేందుకు కాయకష్టం చేస్తాడు. పొద్దస్తమానం పొలమే ఆయన ధ్యాస. ఆ పొలంలో పండే పంటే ఆయన ఊపిరి. ఆరుగాలం కష్టించి పండిన పంట కళ్ల ముందే కనుమరుగైతే.. ఆ రైతు ప్రాణం విలవిల్లాడుతుంది. ఆ రైతు కుటుంబ జీవనం ప్రశ్నార్థకమవుతుంది. ఇలాంటి దుర్ఘతి మరే రైతుకూ రావద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
Telangana: మంచిర్యాల జిల్లాలో ఓ రైతుకు ఇలాంటి దుస్థితి ఎదురైంది. జన్నారంలోని ఓ రైతు తన పొలంలో పండిన వరి ధాన్యం అంతా రైతు వేదికలో అమ్మకానికి ఉంచాడు. గత కొన్ని రోజులుగా కాంటాలు కాలేదు. దీంతో అక్కడే కుప్ప పోసి ఉంచాడు. ఆ ధాన్యం ఎండబెట్టాడు. రాత్రి పూట పట్టా కప్పి ఉంచాడు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టినట్టు ఉంచిన ధాన్యమంతా వరదనీటిలో కొట్టుకుపోయింది.
Telangana: వర్షం వస్తుందని తెలుసుకున్న ఆ రైతు దంపతులు రైతు వేదిక వద్దకు వెళ్లేసరికే వడ్లన్నీ నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీంతో ఆ రైతు గుండె చెరువైంది. వలవలా విలపిస్తూ, తమ కష్టాన్ని తలుచుకుంటూ కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఊడ్చుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. తోటి రైతులు వచ్చి ఓదార్చినా ఆ దుఃఖం ఆగలేదు. ఆ రైతు విలాపం మరో రైతుకు రావద్దని చూసిన ప్రతి ఒక్కరూ సానుభూతి చూపారు.
Telangana: అధికారులు సకాలంలో కాంటాలు వేసి ఉంటే ఆ రైతు ధాన్యం వర్షపు నీటిలో కలిసేది కాదు. ఆ రైతుకు కలిమి ఉండేది. కానీ ఇప్పుడా రైతు ఏడాది బతుకు వర్షపు నీటిలో కొట్టుకుపోతే దిక్కెవరు? అంటూ చూసిన వారు సైతం కన్నీరు కార్చుకున్నారు. ప్రభుత్వం ఆ దిక్కులేని రైతును ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.