TG SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ (SSC) ఫలితాలను ప్రభుత్వం ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్‌సీఈఆర్టీ ప్రాంగణంలో ఉన్న గోదావరి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగ్గా వచ్చాయి. ఈ ఏడాది మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ప్రకటించారు. గత ఏడాది ఉత్తీర్ణత 92.78 శాతంగా ఉండగా, ఈసారి అది 2.37 శాతం పెరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.
విద్యార్థులు తమ రిజల్ట్స్ చూసుకోవడం కోసం విద్యాశాఖ ఈసారి మరిన్ని సులభమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మార్కులను చూసుకోవచ్చు. అంతేకాకుండా, తొలిసారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే సదుపాయం కల్పించారు. విద్యార్థులు 80969 58096 అనే నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే చాలు, వారి ఫలితాలు వెంటనే మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
ఈ ఏడాది ఫలితాల్లో మరో కీలక మార్పు ఏమిటంటే.. కేవలం గ్రేడ్లు (Grades) మాత్రమే కాకుండా, ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా స్పష్టంగా కనిపించేలా మార్కుల మెమోలను రూపొందించారు. దీనివల్ల విద్యార్థులు తాము ఏ సబ్జెక్టులో ఎలా రాశామో వివరంగా తెలుసుకునే అవకాశం కలిగింది. డిజిటల్ విధానంలో ఫలితాలను త్వరగా అందించడం పట్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
