Telangana: రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రివర్గంలోని కొందరు మంత్రులను మారుస్తారా? బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే పనిలో ఉన్నారా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో ఇదే పాచికను వదలాలని కాంగ్రెస్ భావిస్తుందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల అనంతరమే జరిగి తీరుతుందా? ఆ వెంటనే స్థానిక ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Telangana: ఇదే సమయంలో బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రులుగా కొనసాగుతున్నారు.
Telangana: బీసీ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ దశలోనే మరొకరి బీసీ నేతను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకొని, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరును ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని భావిస్తున్నారు. అయితే అధిష్టానానికి దగ్గర నేత అయిన మధుయాష్కీ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Telangana: ఇది ఒక భాగమైతే.. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు కొన్ని సూచనలు హెచ్చరికల తరహాలోనే ఇచ్చినట్టు తెలుస్తున్నది. అటు అధిష్టానం కూడా మంత్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. వివిధ ఆరోపణల కారణంగా వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని కొందరు మంత్రులను హెచ్చరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మార్పు కనిపించని మంత్రులకు ఉధ్వాసన తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Telangana: ఉత్తర తెలంగాణకు చెందిన ఒక బీసీ మంత్రికి, దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు ఓసీ మంత్రులకు ఉధ్వాసన తప్పదని కూడా చర్చ జరుగుతున్నది. వారి స్థానాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మంత్రులుగా తీసుకుంటారని కూడా భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎప్పటి నుంచో ఊరిస్తూ వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
Telangana: గత ఎన్నికల్లో ఓటమి పాలైన అజారుద్దీన్‌కు మంత్రిపదవి దక్కడంతో ప్రజాప్రతినిధులుగా లేని కొందరు కీలక నేతలు కూడా తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారిలో హైదరాబాద్ నగర పరిధిలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అంజన్‌కుమార్ యాదవ్, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మధు యాష్కీగౌడ్ మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు.
Telangana: కొత్త వారు కూడా మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వ విప్‌లుగా కొనసాగుతున్న ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య తమ సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కావాలని కోరుతున్నారు. అదే విధంగా లంబాడా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేదని, దానిని తమతో భర్తీ చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కోరుతున్నారు. ఇవన్నీ జరగాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు 14న విడుదలైన తర్వాతే జరిగే అవకాశం ఉన్నది. అదే సమయంలో స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నది.

