Telangana: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చల్లనికబురు పంపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పింది. దీంతో తెలంగాణ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉన్నది. భూ ఉపరితలం వేడెక్కడంతోనే ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తేల్చి చెప్పింది.
Telangana: ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వానల కారణంగా 2, 3 తేదీల్లో వాతావరణం చల్లబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమ్రం భీం, వనపర్తి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, జోగులాంబ గద్వాల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana: ఈ వర్షాల కారణంగా పంటలకు కొంతవరకు ప్రమాదం కూడా పొంచి ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీరా కోత దశకు వచ్చిన ఈ తరుణంలో వరి ధాన్యం రాలుతుందని, కల్లాల్లో తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత వారం క్రితం వచ్చిన వర్షానికి కొంతమేరకు నష్టం వాటిల్లిందని తెలుపుతున్నారు.

