Team India: దులీప్ ట్రోఫీలో ఆడాలంటూ అగార్కర్ సహా సెలక్టర్లు సూచించినా స్టార్ క్రికెటర్లు విశ్రాంతి పేరుతో ఆ సూచనను పక్కనబెట్టడంపై క్రికెట్ వర్గాల్లో పెను దుమారం చెలరేగుతోంది. కుటుంబంతో వ్యక్తిగతంగా గడిపేందుకో లేదంటే బిజీ షెడ్యూల్ పేరుమీదో లేదంటే గాయాలు ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ పేరుతోనో..దేశవాళీ క్రికెట్ ఆడేందుకు టీమిండియా సూపర్ స్టార్లు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు టీం మేనేజ్‌మెంట్ వారిని ఒప్పించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడం కారణంతోనే కివీస్ తో టెస్టు సిరీస్ లో ఘోర పరాజయం వచ్చిందంటున్నారు
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓడింది. 91 ఏళ్ల భారత క్రికెట్ టెస్టు చరిత్రలో మొదటిసారి 3 అంత కంటే ఎక్కువ టెస్టులు సిరీస్ వైట్‌వాష్ కావడం గమనార్హం. దీనికి కారణం దేశవాళీ క్రికెట్‌లో మన బ్యాటర్లు ఆడకపోవడమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత దాదాపు నెల రోజుల సమయం విరామం వచ్చింది. కానీ, భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, అశ్విన్ దులీప్ ట్రోఫీ బరిలో దిగలేదు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ అంతర్జాతీయ క్రికెటర్లు కూడా దేశవాళీలో ఆడాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Team India: పోస్టుమార్టం తప్పదు
Team India: బెంగళూరు, అనంతపురం వేదికగా సెప్టెంబర్‌లో దులీప్ ట్రోఫీ జరిగింది. అంతర్జాతీయ క్రికెటర్లూ చాలామంది బరిలోకి దిగారు. కానీ, స్టార్ క్రికెటర్లు మాత్రం ఆడలేదు. వారితో ఆడించేందుకు బీసీసీఐ సెలక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత రోహిత్, విరాట్, అశ్విన్ ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ, ట్రోఫీ ప్రారంభం నాటికి తాము విశ్రాంతి తీసుకుంటామని బోర్డుకు చెప్పినట్లు సమాచారం. దీంతో స్టార్లను దులీప్ ట్రోఫీ బరిలోకి దింపడంలో చొరవ చూపలేదని.. అందుకే మిగతా క్రికెటర్ల మాదిరిగా సరైన ప్రాక్టీస్ వారికి లభించలేదనే విమర్శలూ వచ్చాయి.
ఈ ట్రోఫీలో గిల్, సర్ఫరాజ్, పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సుందర్ తదితరులు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుంటే.. ఇలాంటి పరిస్థితి తప్పి ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. . సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతోనే రోహిత్, విరాట్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవ్వడానికి కారణమని మాజీలు విమర్శిస్తున్నారు. ఈ సారి స్పిన్‌ను ఆడటంలో ఇబ్బందిపడటం ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ భారత్ ఓటమికి కెప్టెన్‌గా తనదే బాధ్యతని ఇప్పటికే రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓడిన ప్రతిసారి బాధ్యత నాదేనంటూ దులిపేసుకోవడం రోహిత్ కు అలవాటుగా మారిందని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.