BGT Series

BGT Series: బీజీటీ సిరీస్ ముంగిట అయోమయం.. కంగారులో టీమిండియా

BGT Series: న్యూజిలాండ్ తో సొంతగడ్డపై ముగిసిన టెస్టు సిరీస్ భారత్ కు పీడకలను మిగిల్చింది. సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా. టెస్టు క్రికెట్ లో స్వదేశం , విదేశం అని లేకుండా ..మరోవైపు  పుష్కర కాలంలో మనగడ్డపై ఓటమన్నదే లేకుండా పట్టిష్టమైన  జట్లను మట్టికరిపిస్తూ వచ్చిన భారత జట్టుకు ఇది ఊహించని పరాభవమే. ఇలాంటి స్థితిలో టీమిండియా  ఆస్ట్రేలియా గడ్డపై  బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుంది…? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..

ఇటీవలే న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా. ఇక్కడే ఇలా ఆడితే ఇక ఆస్ట్రేలియాలో మనోళ్ల ఆట ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఫ్యాన్స్ ను  వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ..జట్టులో లోపాలు సరిచేసుకోవడం, ఎవరు ఎలాంటి ఫామ్‌లో ఉన్నారు, ఎవరి ఆట ఎలా ఉండబోతోంది అనే చర్చ జరగాల్సింది పోయి.. ఎవరు జట్టులో ఉంటారు, ఎవరు ఏ స్థానంలో ఆడతారు అన్న అయోమయంలో పడిపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: AUS vs PAK T20: పాకిస్తాన్ ని వాషౌట్ చేసిన ఆసీస్.. టీ20 సిరీస్ కైవసం

 BGT Series: ఇంకో మూడు రోజుల్లో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇప్పటికీ  భారత తుది జట్టుపై ఒక అంచనాలకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. జట్టును నడిపించాల్సిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే అందుబాటులో లేడు. భార్య రెండో బిడ్డను ప్రసవించడంతో అతను స్వదేశంలోనే ఉండిపోయాడు. అతను రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చినా సరే.. సిరీస్‌ ఆరంభ పోరులో కెప్టెన్‌ అందుబాటులో ఉండి జట్టును నడిపిస్తే జట్టుకు కాస్త ధైర్యంగా ఉండేది. కానీ ఇక్కడ అనుకున్నట్లుగా ఏదీ జరగడం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు.

కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం.. అతను రెండో టెస్టుతో జట్టులోకి రానుండడంతో పెర్త్ టెస్టు మ్యాచ్ కు అతని  స్థానంలో వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా, అతనికి కెప్టెన్ గా అనుభవం తక్కువ. ఇప్పటికే జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. టెస్టుల్లో నిలకడగా క్రీజులో అంటిపెట్టుకుని సెషన్ల కొద్దీ బ్యాటింగ్ చేసే బ్యాటర్ కనిపించడం లేదు. అంతేకాదు. కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ కొత్త. పైగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడి వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అతను కూడా ఒత్తిడిలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కూడా అప్పట్లో  ఆటగాడిగా గంభీర్ ది రికార్డు అంత బాగా లేదు.  మరి  బుమ్రాతో కలిసి గంభీర్‌ తొలి టెస్టులో జట్టును ఎలాంటి వ్యూహాలతో నడిపిస్తారో  వేచి చూడాల్సిందే. 5 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ అత్యంత కీలకం.

ALSO READ  National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్‌ల విచారణకు ఈడీ అభ్యర్థన

ఇక్కడ రోహిత్‌ అందుబాటులో ఉంటే జట్టు దృక్పథం వేరుగా ఉండేదోమో కానీ.. గతంలో కోహ్లీ టెస్టు మ్యాచ్ కు అందుబాటులో లేకపోయినా..అంతకుముందు మ్యాచ్ లో 36 పరుగులకే ఆలౌటైనా అనంతరం జరిగిన టెస్టు మ్యాచ్ లో కొత్త కెప్టెన్ రహానే సారథ్యంలోని టీమిండియా అద్భుత విజయం సాధించి తిరిగి గాడిన పడింది. ఇప్పుడు కూడా టీమిండియా చేయాల్సింది అదే. మరి ఏం చేస్తారో చూడాల్సిందే.కివీస్‌తో సిరీస్‌లో కాస్త ఉదాసీనంగా ఉండడం వల్ల టీమ్‌ఇండియా మూల్యం చెల్లించుకుందని మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు.  అలాంటి పేలవ సిరీస్‌ తర్వాత పుంజుకోవాలంటే మరో సిరీస్‌ను మెరుగ్గా ఆరంభించాలి. కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు టెస్టులు చాలా మఖ్యమంటూనే   ఆస్ట్రేలియాలో భారత్‌కు ఈసారి భిన్నమైన  పరిస్థితులు ఎదురుకావొచ్చంటున్నాడు రవిశాస్త్రి.

ఇది కూడా చదవండి: ATP Finals 2024: ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ సినర్‌

 BGT Series: ఈ సిరీస్ కు ముందు తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోవడం ఒక్కటే సమస్య కావడం లేదు.  వన్ డౌన్ లో కీ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ గాయంతో తొలి టెస్టుకు దూరం కావడం భారత్‌కు మరింత  పెద్ద దెబ్బగా మారింది. గిల్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. అతను ఇటీవల మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. మంచి టెక్నిక్‌ ఉన్న అలాంటి బ్యాటర్‌ను దూరం చేసుకోవడం టీమిండియాకు నష్టం చేస్తుంది. టాపార్డర్లో ఒకే సారి  ఇద్దరు కీలక ఆటగాళ్లను రీప్లేస్ చేయడం అంత తేలిక కాదు. రోహిత్, గిల్‌ అందుబాటులో లేకపోవడంతో కేఎల్‌ రాహుల్‌తో ఓపెనింగ్‌ చేయించాల్సిన పరిస్థితి.

అతను పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ముంగిట ఆస్ట్రేలియా-ఎతో తలపడ్డ జట్టులో అతడికి స్థానం కల్పిస్తే ఓ మ్యాచ్‌ ఆడి ఘోరంగా విఫలమయ్యాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా అతడి మోచేతికి గాయమై ఇబ్బంది పడ్డాడు. తన ఫిట్‌నెస్, ఫామ్‌ రెండూ ఆందోళనకరమే. రాహుల్‌ ఓపెనింగ్‌లోకి వస్తే.. మిడిలార్డర్లో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మరింత ప్రశ్నార్థకంగా పరిణమిస్తోంది. అలాగే గిల్‌ స్థానంలో ఎవరు ఆడతారో చూడాల్సిందే.

ఓపెనర్ గా రోహిత్ ప్లేస్ లో ఇటీవల భీకర ఫాంలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ పేరు వినిపిస్తోంది.  అయితే అభిమన్యు ఇప్పటిదాకా టెస్టు అరంగేట్రమే చేయలేదు. అలాంటి ఆటగాడిని కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనలో తొలి మ్యాచ్‌ ఆడిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.  ఆస్ట్రేలియా-ఎతో మ్యాచ్‌లో అతను తేలిపోయాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ రూపంలో మరో ప్రత్యామ్నాయం ఉంది. కానీ అతను ఆడిందీ ఒక్క టెస్టే. జురెల్‌ ‘ఎ’ జట్టు తరఫున సత్తా చాటాడు కానీ.. అనుభవం తక్కువైన అతను ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్లను ఎదుర్కొని ఏమేర నిలవగలడో చూడాలి.

ALSO READ  Charlapalli Drug Case: చర్లపల్లి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు

ఇది కూడా చదవండి: Magnus Carlsen: బ్లిట్జ్ టైటిల్ తో కార్ల్‌సన్‌ డబుల్‌ టాటాస్టీల్ చెస్ ఇండియా టోర్నీ

 BGT Series: అదీగాక అతన్ని నమ్ముకుని అత్యంత కీలకమైన గిల్ స్థానంలో బరిలోకి దింపడం అంటే అతిపెద్ద సాహసం అనే చెప్పాల్సి వస్తుంది. గత ఆసీస్ పర్యటనలో పుజార, రహానే అద్భుత బ్యాటింగ్  ప్రదర్శించారు. అంతేకాదు ఓడిపోవాల్సిన సిడ్నీ టెస్టులో భీకరమైన ఆసీస్ బౌలింగ్ కు అడ్డుగోడలా నిలబడి విహారి, అశ్విన్ పరాజయం తప్పించారు. అలాంటి బ్యాటర్లు లేకపోవడంతో ఇప్పుడు ఇంత ఆందోళన కలిగిస్తోంది. టీ20 మేనియాలో క్రీజులోకి రావడంతోనే షాట్లు ఆడేందుకు ప్రయత్నించి ఔట్ కావడంతో మనకు టెస్టు క్రికెట్ లో ఓటమిలు పలకరిస్తున్నాయి. ఎవరో ఒకరు క్రీజులో సెషన్ల కొద్దీ నిలబడి ఆసీస్ బౌలర్లను ఆడితేనే మనకు విజయం దక్కుతుంది.

బ్యాటింగ్ లోనే కాదు.. బౌలింగ్ లోనూ మనకు సమస్యలే కనిపిస్తున్నాయి. వెటరన్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ గతంలోలా వికెట్లు తీయలేకపోతున్నారు. కాగా, సీనియర్‌ పేసర్‌ షమి అందుబాటులో లేకపోవడంతో బుమ్రా, సిరాజ్‌లకు తోడు మూడో పేసర్‌ విషయంలోనూ భారత్‌ ఇబ్బంది పడుతోంది. హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణ ఈ స్థానం కోసం పోటీపడుతున్నా  ఈ ఇద్దరూ ఇప్పటిదాకా ఆసీస్ గడ్డపై  ఒక్క టెస్టూ ఆడలేదు. హర్షిత్‌ అయితే అంతర్జాతీయ అరంగేట్రమే చేయలేదు. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే విషయంలో అయోమయం నెలకొంది.  ఆతిథ్య ఆస్ట్రేలియా ఏమో మ్యాచ్‌ ఆరంభానికి పది రోజుల ముందే 13 మందితో జట్టును ప్రకటించింది.

అందులో తుది జట్టులో ఉండేదెవరో అందరికీ తెలుసు. రెండో ఓపెనర్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కొత్త ఆటగాడు మెక్‌స్వీనీకి అవకాశమిచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ టెస్టుల్లో తోపులే. అందరూ ప్రపంచ స్థాయి క్రికెటర్లే. మరి మంచి ఫామ్‌తో, మేటి జట్టుతో, చక్కటి ప్రణాళికతో సొంతగడ్డపై సిరీస్‌కు సిద్ధమవుతున్న కంగారూ జట్టుకు.. ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో ఎంతమేర పోటీ ఇస్తుందో..? ఎలా గడిచి గట్టెక్కుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *