IND vs WI: ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి రోజు భారత్ కేవలం కొన్ని ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని విజయం ఖాతాలో వేసుకుంది.
రెండో టెస్ట్‌లో ఐదో రోజు ఆటను 63/1 స్కోరుతో ప్రారంభించిన భారత్, మరో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. కేఎల్ రాహుల్ 58 పరుగులతో అర్ధశతకంతో మెరిశాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేయగా, ధృవ్ జురెల్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మన్‌లు అదరగొట్టారు. యశస్వీ జైస్వాల్ 175 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో, ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టును 518 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయించారు.
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ ఐదు వికెట్లు, జడేజా మూడు వికెట్లు తీసి విండీస్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఫాలోఆన్ ఇన్నింగ్స్‌లో మాత్రం విండీస్ జట్టు పోరాటస్ఫూర్తి చూపింది. జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలతో జట్టును నిలబెట్టారు. జస్టిన్ గ్రీవ్స్ (50), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) కూడా విలువైన పరుగులు అందించారు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్ 390 పరుగులు చేసి భారత్‌కు 121 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
Also Read: Mithali Raj: మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం
బౌలింగ్ విభాగంలో భారత జట్టు మరోసారి సత్తా చాటింది. కుల్‌దీప్ యాదవ్ ఎనిమిది వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా నాలుగు, సిరాజ్ మూడు వికెట్లు సాధించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, వారికన్ ఒక వికెట్ తీశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ దూకుడుగా రాణించింది. ఈ విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానం బలోపేతం చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం భారత్ పాయింట్ల శాతం 61.9కి చేరి, మూడవ స్థానంలో కొనసాగుతోంది.
విండీస్ కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమైనప్పటికీ, రెండో టెస్టులో ఆ జట్టు ధైర్యంగా పోరాడింది. అయితే భారత బౌలర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు చూపిన ప్రతిభకు చివరికి విండీస్ తలవంచక తప్పలేదు. ఈ సిరీస్ విజయంతో భారత జట్టు మరోసారి ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించింది.