Team India: కొత్త కుర్రాళ్లకు గొప్ప అవకాశం. టీమిండియాలో ఇపుడు సంధి కాలం నడుస్తోంది. గతంలో సచిన్ సహా దిగ్గజాలు ఒక్కొక్కరుగా నిష్క్రమించినపుడు రోహిత్, కోహ్లి స్టార్లుగా మారారు. ఇపుడు ఆ ఇద్దరితో పాటు మరికొందరు కెరీర్లో చివరి దశకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ట్వంటీ20లకు గుడ్‌బై చెప్పేయడం.. టెస్టులు, వన్డేల్లో కూడా వీరి ప్రదర్శన తీసికట్టుగా మారడం… రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్లు కూడా రిటైర్మెంట్కు దగ్గరపడుతున్న నేపథ్యంలోనే సెలక్టర్లు యువ ఆటగాళ్ల మీద దృష్టి సారించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం యువ ఆటగాళ్లకు అవకాశం దక్కిన నేపథ్యంలో వారిపై ఓ లుక్కేద్దాం.
Team India: ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 303 పరుగులు, 3 వికెట్లతో సత్తాచాటి ఇటీవల టీ20 జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం పట్టేశాడు. 21 ఏళ్ల ఈ విశాఖ కుర్రాడు బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లో 90 పరుగులు, 3 వికెట్ల ఆల్‌రౌండ్ ప్రదర్శన తో మెప్పించాడు. హార్దిక్ పాండ్యా సహా పేస్ ఆల్‌రౌండర్లు తరచూ గాయాల బారిన పడుతుండటంతో భవిష్యత్ ప్రత్యామ్నాయ అవకాశంగా నితీశ్‌పై సెలక్టర్లు దృష్టి సారించారు. అతను కూడా అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్ల భారత జట్టులో నితీశ్ ఒక్కడే పేస్ ఆల్‌రౌండర్. ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కితే ఆసీస్ పిచ్‌లపై అతను కీలకంగా మారే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-ఎతో సిరీస్ కోసం భారత్-ఎ తరపున అతను కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. ఈ రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లతో అక్కడి పరిస్థితులపై అతనికి అవగాహన వచ్చే అవకాశముంది. ఇప్పటివరకూ 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అతను 708 పరుగులు, 55 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
Team India: ఎదురుగా ఎంతటి మేటి బ్యాటర్ ఉన్నా.. పదునైన వేగంతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టడమే హర్షిత్ రాణా అలవాటు. కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి జట్టుకు విజయాలు అందించడం.. 22 ఏళ్ల ఢిల్లీ యంగ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలవడంలో హర్షిత్‌ది కీలక పాత్ర. 11 ఇన్నింగ్స్‌ల్లో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్, నెహ్రా, ఇషాంత్, గంభీర్, కోహ్లి లాంటి ఆటగాళ్లను టీమ్‌ఇండియాకు అందించిన పశ్చిమ ఢిల్లీ నుంచి వచ్చిన హర్షిత్… చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఇష్టంతో సాగాడు. బంతులేస్తే బ్యాటర్లు భయపడాలని చెప్తూ అథ్లెట్, వెయిట్‌లిఫ్టర్ అయిన తండ్రి ప్రదీప్ రాణా ఎప్పటికప్పుడూ అతనిలో స్ఫూర్తి నింపేవాడు. దేశవాళీల్లో దిల్లీ తరపున రాణించిన హర్షిత్ 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు. అతను ఓ సెంచరీ సహా 410 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనతో శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టులో ఉన్నప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. హర్షిత్ ప్రతిభపై నమ్మకముంచిన కోచ్ గౌతం గంభీర్ అతనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 6.2 అడుగుల ఎత్తు ఉండే హర్షిత్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరే బౌన్సర్లను ఆడటం బ్యాటర్లకు సవాలే. అలాగే పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని తగ్గించుకుని వైవిధ్యంతోనూ అతను బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. అందుకే టీమిండియా అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Team India: ధనాధన్ షాట్లు ఆడడంతో పాటు మిడిలార్డర్‌లో టీమ్ బ్యాటింగ్ కు నిలకడ తీసుకురాగల సత్తా రమణ్‌దీప్ సింగ్ సొంతం. 27 ఏళ్ల ఈ పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ అలవోకగా భారీ షాట్లు కొట్టగలడు. ఇటీవల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్‌లో సెమీస్‌లో అఫ్గానిస్తాన్‌పై 34 బంతుల్లోనే 64 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున 9 ఇన్నింగ్స్‌ల్లో 125 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ 200 పైన ఉండటం విశేషం. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలే అతను.. పేసర్‌గానూ సూపర్ ఫెర్పార్మెన్స్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకూ దేశవాళీల్లో 37 టీ20 ఇన్నింగ్స్‌ల్లో రమణ్‌దీప్ 170 స్ట్రైక్‌రేట్‌తో 544 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ రాణించి 16 వికెట్లూ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రకాలుగానూ ఉపయోగపడతాడనే కారణంతోనే రమణ్‌దీప్‌ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో బౌలింగ్ కూడా చేయగల బ్యాటర్ల సంఖ్యను పెంచే దిశగా చేస్తున్న కసరత్తుల్లో భాగంగానే అతనికి ఇప్పుడు అవకాశం దక్కింది.
Team India: ఒకప్పుడు అధిక బరువుతో బాధపడి.. ఫిట్‌నెస్ లేక, బౌలింగ్‌లో వేగం లేక కన్నీళ్లు పెట్టుకున్న వైశాఖ్ జయ్‌కుమార్ ఇప్పుడు టీమ్‌ఇండియా తలుపు తట్టాడు. కష్టాన్ని నమ్ముకొని అతడు ఫిట్‌గా మారాడు. కర్ణాటక చెందిన ఈ 27 ఏళ్ల పేసర్ అయిదేళ్ల క్రితం అధిక బరువు ఉండటంతో తన క్రికెట్ కెరీర్ ఎలా సాగుతుందోనని ఆందోళన చెందాడు. కానీ ఆగిపోలేదు. టీమ్‌ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దగ్గర శిక్షణ పొందిన అతను ఫిట్‌నెస్ సాధించడమే కాకుండా బౌలింగ్‌లోనూ వేగాన్ని పెంచుకున్నాడు. కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించాడు. ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతూ ఆకట్టుకున్నాడు. వైశాఖ్ 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 సగటుతో 99 వికెట్లు పడగొట్టాడు. 21 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు సాధించాడు. అధిక బరువుతో వైశాఖ్ తీవ్రంగా బాధపడ్డాడు. కెరీర్‌కు తెరపడుతుందేమోనని భయపడ్డాడు. కానీ భరత్ అరుణ్ దగ్గర శిక్షణతో మెరుగయ్యాడు. ఆర్సీబీ జట్టులో అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడని వైశాఖ్ తండ్రి విజయ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
Team India: అభిమన్యు ఈశ్వరన్.. ఈ భారత మైటీ ఓపెనర్ పేరు గత కొంతకాలంగా భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నది. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ టన్నుల కొద్దీ పరుగులతో అతను అరంగేట్రానికి అడుగు దూరంలో ఉంటూ వస్తున్నాడు. 2022లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం అతణ్ని ఎంపిక చేసినా తుదిజట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఎంపికైన అతను ఈ సారి కచ్చితంగా ఆడేలా కనిపిస్తున్నాడు. ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో ఒక వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ రోహిత్ దూరమయ్యే అవకాశముంది. ఆ మ్యాచ్‌లో 29 ఏళ్ల అభిమన్యు ఆడటం ఖాయం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నఈ బెంగాల్ ఆటగాడు 99 మ్యాచ్‌ల్లో 49.92 సగటుతో 7638 పరుగులు చేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఈ ఓపెనర్ సెంచరీలు బాదాడు. దులీప్ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఇరానీ కప్‌లో 191 పరుగుల ఇన్నింగ్స్ ఆడడంతోపాటు ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు.