మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే వీరి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో ఆస్తుల కోసం అంతర్యుద్ధం జరగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల రాసిన ఓ లేఖను టీడీపీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజీ కోసం తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలకు జగన్ ఓ లేఖ రాశారు. దానికి షర్మిల ఘాటుగా సమాధానం ఇస్తూ.. జగన్‌కు రాసిన లేఖను టీడీపీ విడుదల చేసింది. ఆస్తుల విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చెప్పారో ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.
‘మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నట్లు ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకు ఒప్పుకోనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్, సాక్షి.. ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే ఆయన స్పష్టంగా చెప్పారు. వీటన్నింటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు.. మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా’ అని షర్మిల లేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖను టీడీపీ సోషల్ మీడియాలో పెట్టడంతో వైఎస్ కుటుంబంలో ఆస్తుల తగాదం చర్చనీయాంశంగా మారింది.

