Tamannaah Bhatia: మైసూర్ శాండల్ సబ్బు, కర్ణాటక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బ్రాండ్, తాజాగా వివాదంలో చిక్కుకుంది. 1916లో మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ స్థాపించిన ఈ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం నియమించడం రాజకీయ దుమారం రేపింది. రెండేళ్ల ఒప్పందంతో తమన్నాను ఎంపిక చేయగా, దీనిపై కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కన్నడ నటీమణులను విస్మరించి, ముంబైలో జన్మించిన తమన్నాను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ, ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఈ నిర్ణయాన్ని “కన్నడిగుల మనోభావాలకు విరుద్ధం” అని విమర్శించారు. తమన్నాకు రూ.6.2 కోట్లు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిధులను విద్య, ఆరోగ్య కార్యక్రమాలకు ఉపయోగించాలని విపక్షాలు సూచిస్తున్నాయి. అయితే, మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ, తమన్నా పాన్-ఇండియా ఇమేజ్ ఉంది, 28 మిలియన్ల డిజిటల్ ఫాలోవర్స్ ఉన్నారు. అందువల్ల బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 2028 నాటికి రూ.5,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

