Crime News: అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు దురదృష్టవశాత్తూ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారా ఏరియాలో జరిగిన ఈ ఘటన రెండు వారాల తర్వాత వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన హసానుద్దీన్–ఫర్జానాబేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29), 2016లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించి, గత ఏడాది ప్రమోషన్‌తో కాలిఫోర్నియాకు మారాడు. అయితే ఇటీవల వీసా సమస్యలు, ఉద్యోగ ఒత్తిడితో ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ఈ నెల 3న రూమ్మేట్‌తో ఏసీ విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంలో కత్తితో దాడి చేయడంతో గాయపడిన రూమ్మేట్ ఆస్పత్రికి తరలించబడ్డాడు. పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు చేరుకొని లొంగిపోవాలని పలు మార్లు హెచ్చరించినా, నిజాముద్దీన్ వినకపోవడంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: Mega DSC 2025: మెగా డీఎస్సీ సభ వాయిదా.. ఎందుకంటే..?
ఈ ఘటన గురించి నిజాముద్దీన్ తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. “నా కొడుకు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించాడు. కానీ వీసా సమస్యలతో ఒత్తిడి పెరిగింది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి. మాకు న్యాయం జరగాలి” అని తండ్రి హసానుద్దీన్ బాధ వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు నిజాముద్దీన్ తల్లిదండ్రులు భారత విదేశాంగ మంత్రిత్వశాఖను ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ సంఘటనతో పాలమూరు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.