Supreme Court: దేశవ్యాప్తంగా వేలాది విమాన ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టిన ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌కు న్యాయస్థానం అమోదం తెలపలేదు. విమానాల రద్దు, ఆలస్యాల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను కోర్టు అంగీకరించినా, ప్రభుత్వం ఇప్పటికే సమస్యను పరిశీలిస్తూ చర్యలు చేపడుతోందని గుర్తుచేసింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌పై, తక్షణ జోక్యం అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. లక్షలాది మంది విమానాశ్రయాల్లో గంటల తరబడి నిలిచిపోయిన పరిస్థితిని కోర్టు గుర్తించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన దిశలో ఉన్నాయని అభిప్రాయపడింది.
Also Read: TG High Court: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
ఆరు రోజులుగా ఇండిగో విమానాలు వరసగా రద్దు అవుతూ, ఆలస్యాలు పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక విమానాశ్రయాల్లో దాదాపు 2,500 కి పైగా ఫ్లైట్ల షెడ్యూల్స్ దెబ్బతిన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ సమస్యపై పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ నుంచి స్టేటస్ రిపోర్ట్ కూడా కోరాలని పిటిషనర్ అభ్యర్థించాడు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ కార్యాచరణ సరైనదిగా కనిపిస్తోందని పేర్కొంటూ, ఈ దశలో కోర్టు జోక్యం అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. కానీ కేంద్రం పరిస్థితిని గమనించి, తగిన చర్యలు మొదలుపెట్టింది. కాబట్టి అత్యవసర విచారణకు కారణం కనిపించడం లేదు అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉండగా, ప్రయాణికుల ఇబ్బందులు ఎప్పుడు తగ్గుతాయన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

