Subramanyam Vedam: భారత సంతతికి చెందిన సుబ్రమణ్యం వేదం (64) జీవితం న్యాయ వ్యవస్థలోని లోపాలకు నిదర్శనంగా మారింది. 43 ఏళ్ల పాటు చేయని హత్య కేసులో నిర్దోషిగా జైలు శిక్ష అనుభవించిన ఆయనకు, స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో కూడా మరో ముప్పు ఎదురైంది. ఆయన్ను దేశం నుంచి బహిష్కరించవద్దని (Deportation) రెండు అమెరికా కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి.
నాలుగు దశాబ్దాల అన్యాయపు నిర్బంధం
సుబ్రమణ్యం వేదం కేవలం తొమ్మిది నెలల వయసులో చట్టబద్ధంగా తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆయన తండ్రి పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వేదం శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కలిగి ఉన్నారు.
1980లో ఆయన స్నేహితుడు థామస్ కిన్సర్ హత్యకు గురయ్యాడు. చివరిసారిగా కిన్సర్‌తో కనిపించింది వేదమే కావడంతో, బలమైన సాక్ష్యాలు లేకపోయినా పోలీసులు ఆయన్ను నిందితుడిగా చేర్చారు. కోర్టు రెండుసార్లు దోషిగా నిర్ధారించి, పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించింది.
ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు
40 ఏళ్లకు పైగా జరిగిన న్యాయపోరాటం తర్వాత, ప్రాసిక్యూటర్లు దాచిపెట్టిన కీలకమైన బాలిస్టిక్స్ ఆధారాలను వేదం న్యాయవాదులు బయటపెట్టారు. దీంతో, ఈ ఏడాది ఆగస్టులో న్యాయమూర్తి ఆయన శిక్షను రద్దు చేసి, నిర్దోషిగా ప్రకటించారు.
జైల్లో ఉన్నప్పుడే వేదం మూడు డిగ్రీలు సంపాదించారు, తోటి ఖైదీలకు ట్యూటర్‌గా, మార్గదర్శకుడిగా సేవలందించారు.
బహిష్కరణ ముప్పు, కోర్టుల తాత్కాలిక ఊరట
అక్టోబర్ 3న పెన్సిల్వేనియా జైలు నుంచి విడుదలైన వెంటనే, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు ఆయన్ను నేరుగా లూసియానాలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
సుమారు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎల్‌ఎస్‌డీ డెలివరీకి సంబంధించిన పాత డ్రగ్స్ కేసును కారణంగా చూపుతూ ICE అధికారులు ఆయన్ను బహిష్కరించాలని ప్రయత్నించారు.
హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన, పాత డ్రగ్స్ కేసు శిక్ష రద్దు కాదని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదించింది. చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో గడిపిన వ్యక్తి విషయంలో ఈ పాత కేసును పరిగణనలోకి తీసుకోరాదని న్యాయవాదులు కోర్టులో వాదించారు.
తాజాగా, ఇమ్మిగ్రేషన్ కోర్టు మరియు పెన్సిల్వేనియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు సైతం ఆయన బహిష్కరణపై స్టే విధించాయి. “రెండు వేర్వేరు కోర్టులు సుబు (సుబ్రమణ్యం) బహిష్కరణ సరికాదని చెప్పడం మాకు ఉపశమనం కలిగించింది. చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తికి మరో అన్యాయం జరగదని ఆశిస్తున్నాం” అని ఆయన సోదరి సరస్వతి వేదం అన్నారు.
ప్రస్తుతం వేదం కేసుపై ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు. దశాబ్దాల అన్యాయానికి గురైన సుబ్రమణ్యం వేదానికి స్వేచ్ఛా జీవితం లభిస్తుందా లేదా అనేది కొద్ది నెలల్లో తేలిపోనుంది.

