Srikanth bharat: జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సదరు నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం ఆయన హైదరాబాద్లోని బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, శ్రీకాంత్ భరత్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకట్ బల్మూరి మాట్లాడుతూ,
“వాక్ స్వాతంత్ర్యం పేరుతో కొందరు హద్దులు మీరుతున్నారు. గాడ్సే వారసులమని చెప్పుకునే వారు గాంధీజీపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు,” అని మండిపడ్డారు.సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి, శ్రీకాంత్ భరత్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరతామని తెలిపారు.
“ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ భరత్పై ఫిర్యాదులు చేస్తాం,” అని వెంకట్ బల్మూరి స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.