Srikakulam: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించింది. విద్యార్థినుల చేత కాళ్లు నొక్కించుకున్న ఆ టీచర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
వీడియో వైరల్‌తో వెలుగులోకి
శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం, బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల. ఉపాధ్యాయురాలు సుజాత సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు పట్టించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ.. పలువురి మృతి
అధికారుల తక్షణ చర్య
సమాచారం అందిన వెంటనే ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) పవార్ స్వప్నిల్ జగన్నాథ్ విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిల్లలను పనుల్లో పెట్టడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి ఘటనలను అధికారులు ఏమాత్రం ఉపేక్షించబోమని ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు.

