Sreeleela

Sree Leela: AI టెక్నాలజీతో సెలబ్రిటీల వేధింపులు.. శ్రీలీల ఘాటు హెచ్చరిక!

Sree Leela: ప్రపంచం మనం ఊహించిన దానికంటే వేగంగా మారుతోంది. కమ్యూనికేషన్ కోసం కలాన్ని వాడిన కాలం నుండి నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడే స్థాయికి చేరుకున్నాం. మారుతున్న టెక్నాలజీని సామాన్యుల పనులను సులభతరం చేయడానికి ఎంత వాడుతున్నారో తెలియదు కానీ, కొందరు మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తూ సినిమా సెలబ్రిటీల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా AI సాయంతో నటీనటుల అసభ్యకరమైన వీడియోలు (డీప్‌ఫేక్) సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

ఇలాంటి అసాంఘిక పనులకు పాల్పడే వారిని ఉద్దేశిస్తూ నటి శ్రీలీల సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది

కళలను తమ కెరీర్‌గా ఎంచుకొని ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ సమాజంలో భాగమేనని ఆమె గుర్తుచేశారు. బయటి ప్రపంచంలో ఒక నటి ఎవరికో ఒకరికి కూతురుగా, సోదరిగా, స్నేహితురాలిగా లేదా సహోద్యోగిగా ఉంటుందని తెలిపారు. “మేము మాకు నచ్చిన వృత్తిలో పని చేస్తున్నప్పుడు.. మాకు భయం లేని, రక్షణ కల్పించే వాతావరణం ఉండాలని కోరుకుంటాం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Maoist Party: నిరాయుధుల అరెస్టు అప్రజాస్వామికం.. మావోయిస్టు పార్టీ కీలక లేఖ

ఇది వ్యక్తిగత దాడి

షూటింగ్‌లలో బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ పరిణామాలు తన దృష్టికి రావడానికి కొంత సమయం పట్టిందని శ్రీలీల పేర్కొన్నారు. తన సన్నిహితులు చెప్పిన తర్వాతే ఈ విషయాలు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కేవలం తనకే కాకుండా, ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరి తరపున తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు సృష్టించడం తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడి అని, దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.

కఠిన చర్యలకు సిద్ధం

ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇకపై చట్టపరంగా వారు చూసుకుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను చూస్తూ ప్రోత్సహించే వారు కూడా మారాలని ఆమె కోరారు. ప్రజలు ఇలాంటి వీడియోలను చూడటం మానేస్తే, వాటిని సృష్టించే వారు కూడా తగ్గుతారని అభిప్రాయపడ్డారు. “టెక్నాలజీ మనుషుల పనులను సులభతరం చేయాలి కానీ, ఇతరులను నొప్పించే విధంగా ఉండకూడదు” అని శ్రీలీల హితవు పలికారు.

Sreeleela

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *