IND vs SA 3rd T20I: దక్షిణాఫ్రికాతో నాలుగు ట్వంటీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా యంగ్ టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి టీ20లో ఆతిథ్య జట్టును సంచలన ఆటతీరుతో చిత్తుచేసిన సూర్య సేన రెండో టీ20లో తడబడింది. కీలక సమయాల్లో వికెట్లు తీయలేక చేజేతులా మ్యాచ్‌ను పోగొట్టుకుంది. మరి మూడో టీ20లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతోంది? గెలిచి ముందంజ వేస్తుందా? ఓటమితో నిరుత్సాహపరుస్తుందా?
ఘనవిజయంతో సౌతాఫ్రికా టూర్ మొదలుపెట్టి, రెండో మ్యాచ్‌లో తడబడ్డ భారత టీ20 జట్టు.. కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారమే మూడో టీ20 మ్యాచ్. దీనిలో ఓడితే సిరీస్ సాధించే అవకాశముండదు. రెండో టీ20లో ఓటమి భారత్‌ను బాధించే ఉంటుంది. టాపార్డర్ వైఫల్యంతో 124 పరుగులకే పరిమితమైన టీమ్‌ఇండియా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలంతో విజయం సాధించేలా కనిపించింది. ఆఖర్లో పట్టువిడవడం భారత్‌కు ఎప్పట్నుంచో ఉన్న బలహీనత. అదే ఈసారీ రిపీటైంది. చివరి ఓవర్లలో పేసర్లు పేలవ ప్రదర్శన చేయడంతో ఓడిపోయింది. మూడో టీ20లో అయినా పట్టుదలతో ఆడి గెలుస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: Team India: టీమిండియా ప్రాక్టీస్ షురూ
IND vs SA 3rd T20I: దక్షిణాఫ్రికా అంటేనే పేసర్లకు స్వర్గధామం వంటిది. అయితే ఇపుడా పరిస్థితి కొద్దిగా మారింది. అక్కడి పిచ్‌లు స్పిన్‌కూ కొంత సహకరిస్తున్నాయి. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దీన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అతను.. రెండో టీ20లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. మరి పేస్ పిచ్‌గా పేరుపడ్డ సెంచూరియన్‌లో వరుణ్ ఎలాంటి మాయాజాలం చేస్తాడో చూడాలి. అతడితో పాటు రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటుతున్నాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను మాత్రం కెప్టెన్ సూర్య సరిగా ఉపయోగించుకోవడం లేదు.
రెండో టీ20లో పేస్ బౌలర్లు, బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. తుది ఓవర్లలో అర్షదీప్, అవేష్ ఖాన్ ల బౌలింగ్ తీసికట్టుగా ఉంది. వీళ్లిద్దరూ పరుగులు కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. తొలి టీ20లో బ్యాటింగ్ పిచ్‌పై రెచ్చిపోయిన భారత బ్యాటర్లు.. రెండో మ్యాచ్‌లో కఠినమైన పిచ్ పై పరుగుల కోసం చెమటలు కక్కారు. తొలి మ్యచ్ లో సెంచరీ చేసిన సంజు ఈ మ్యాచ్ లో డకౌటయ్యాడు. అభిషేక్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లోనూ విఫలమైతే అతన్ని ఆడించడంపై యాజమాన్యం పునరాలోచన చేయక తప్పదు. సూర్య నుంచి మునుపటి మెరుపులు లేవు. తిలక్ బాగానే ఆడుతున్నా కీలక సమయాల్లో వికెట్ ఇచ్చేస్తున్నాడు. హార్దిక్ గత మ్యాచ్‌లో ఫరవాలేదనిపించాడు. ఓ ముగ్గురు బ్యాటర్లైనా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, భారీ స్కోర్లు చేస్తే బౌలర్లపై ఒత్తడి తగ్గుతుంది.
IND vs SA 3rd T20I: కీలకమైన మూడో మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశముంది. రెండు టీ20ల్లో రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్‌కుమార్‌లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో వీరిలో కొందరిని పరీక్షించవచ్చు. అక్షర్ స్థానంలో రమణ్.. అవేష్ బదులు యశ్, వైశాఖ్ విజయకుమార్లలో ఒకరిని ఆడించొచ్చు. ఇక దక్షిణాఫ్రికా… సిరీస్‌లో తొలి విజయం ఇచ్చిన ఊపును కొనసాగించాలని చూస్తోంది. ఆ జట్టుకూ బ్యాటింగే సమస్య. మార్‌క్రమ్, క్లాసెన్ లాంటి మేటి బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. టాప్‌ఆర్డర్ తడబడుతోంది. గత మ్యాచ్‌లో స్టబ్స్ సమయోచిక ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది. బౌలింగ్ లో మాత్రం రాణించింది. మరి సెంచూరియన్ లో జరిగే మ్యాచ్లో బౌన్సీ పిచ్ పై టీమిండియా బ్యాటర్లు ఎలా పరుగులు చేస్తారో ఆసక్తికరమే. తొలి ఓవర్లలో పేసర్లను నిలువరిస్తే ఆ తర్వాత బ్యాటింగ్ చేయడం తేలికే. ఔట్‌ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. దీంతో మూడో ట్వంటీ20లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కూడా ఉంది.