Asian Champions Trophy: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్ట్రైకర్ దీపిక రెండు గోల్స్ తో అదరగొట్టడంతో మంగళవారం జరిగిన మ్యాచ్లో 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇండియా దూకుడుగా ఆడింది. సంగీత కుమారి మూడో నిమిషంలోనే గోల్ కొట్టడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత దీపిక 20వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్ లోకి పంపడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన కొరియా సర్వశక్తులూ ఒడ్డి పుంజుకుంది.
ఇది కూడా చదవండి: IND vs SA 3rd T20I: గెలిచి నిలిచేనా..ఓడి తేలిపోయేనా?
Asian Champions Trophy: స్వల్ప వ్యవధిలోనే రెండు పెనాల్టీకార్నర్లను సృష్టివంచుకుని వాటిని సద్వినియోగం చేసి 2-2తో స్కోరు సమం చేసింది. కొరియా తరఫున యూరీ లీ 34వ నిమిషంలో, కెప్టెన్ చెయాన్ 38వ నిమిషంలో గోల్స్ చేశారు. ఆ తర్వాత చాలాసేపటి వరకు రెండు జట్లూ (India vs South Korea) గోల్స్ సాధించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమో అనిపించింది. కానీ 57వ నిమిషంలో దక్కిన పెనాల్టీ స్ట్రోక్ ను దీపిక గోల్ గా మలిచి భారత్‌కు విజయం అందించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 4-0తో మలేసియాను ఓడించింది.