CM Vijay

CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!

CM Vijay: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, దళపతి విజయ్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల సంస్కృతికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఆయన ఒక సంచలన పథకాన్ని ప్రకటించారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా రూ.1,000 లంచం అడిగితే, ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి పట్టిచ్చిన సామాన్య ప్రజలకు ఏకంగా రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు. సామాన్య జనాన్నే అవినీతి నిరోధక సైన్యంగా మారుస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని విజయ్ సర్కార్ బలోపేతం చేసింది. లంచం అడిగే అధికారులపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయడం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని వంద శాతం తుడిచిపెట్టేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. “ప్రజల డబ్బులోంచి నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోను, అవినీతి లేని పాలన అందిస్తాను” అని విజయ్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా టీవీకే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి సమగ్ర సమాచారంతో కూడిన ‘తమిళనాడు పౌరసత్వ కార్డు’ను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డు ఉంటే ప్రజలు ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా వారి ఇంటికే అందుతాయి. ప్రస్తుతం 108 సీట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. అధికారంలోకి రాగానే క్షేత్రస్థాయిలో మార్పులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మంత్రి ఆధవ్ అర్జున తొలిసారిగా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పాలనాపరమైన సంస్కరణలపై చర్చించారు.

అవినీతిపైనే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్, అక్రమ మద్యం రవాణాపై కూడా సీఎం విజయ్ యుద్ధం ప్రకటించారు. తమిళనాడులో మాదకద్రవ్యాలు కొన్నా, అమ్మినా కఠినమైన గూండా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. అక్రమ మద్యం దుకాణాల తొలగింపుతో పాటు పోలీస్ స్టేషన్లలో పౌరులు ఫిర్యాదు చేసేటప్పుడు పారదర్శకత కోసం వీడియో తీసే విధానాన్ని తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యులెవరూ తమ పేరు చెప్పి ప్రభుత్వ అధికారుల పనితీరులో జోక్యం చేసుకోకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలు లంచాలకు అలవాటుపడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీనికి తోడు సీఎం విజయ్ స్వయంగా ఒక సాధారణ ఉద్యోగిలా ప్రతిరోజూ కరెక్ట్ సమయానికి సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించడం అధికారులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆదర్శంగా నిలుస్తూ, అవినీతి నిరోధానికి తీసుకుంటున్న ఈ సంచలన చర్యలను సామాన్య ప్రజలు, పేదలు సాదరంగా స్వాగతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *