Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 23న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్ మంగళవారం అధికారికంగా వెల్లడించారు. మే 23వ తేదీన యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో నిర్మించబోయే ‘శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల’ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి, శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పవిత్ర సమక్షంలో, వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరగనుంది. వేద పాఠశాల మాత్రమే కాకుండా, భక్తుల సౌకర్యార్థం యాదద్రి కొండపైన రూ.100 కోట్ల భారీ వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే రోజు పునాది రాళ్లు వేయనున్నారు. ఇందులో భాగంగా కొండపైన అత్యాధునిక వసతులతో నిర్మించనున్న భారీ కళ్యాణ మండపం, స్వామివారి దీక్షలు తీసుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్మించే ‘దీక్షాపరుల సదనం’ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
వీటితో పాటు కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేలా మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, అలాగే ప్రధాన ఆలయానికి వాయువ్య దిశ నుంచి నేరుగా మాడ వీధుల్లోకి వెళ్లడానికి వీలుగా నిర్మించే సరికొత్త మెట్ల మార్గం పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు, ముఖ్యమంత్రి పర్యటన కంటే ఒకరోజు ముందే, అంటే మే 22వ తేదీన కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. కొండపై లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారని ఆలయ ఈవో భవాని శంకర్ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, కంచి పీఠాధిపతి రాకను పురస్కరించుకుని అధికారులు యాదగిరిగుట్టలో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించారు.
