Aditi Rao Hydari: తెలంగాణ మూలాలు ఉన్న అదితీరావ్ హైదరీ గత నెల 16న నటుడు సిద్ధార్థ్ను వివాహం చేసుకుంది. వీరి వివాహం వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. అయితే సిద్ధార్థ్ సరసన ‘మహా సముద్రం’ సినిమాలో నటించినప్పటి నుండీ వీరి మధ్య ప్రేమచిగురించింది. దానికి ముందు అదితీరావ్ హైదరీ మూడు తెలుగు సినిమాల్లో నటించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ‘సమ్మోహనం, వి’ చిత్రాలతో పాటు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’లోనూ నటించింది. మలయాళ, తమిళ, హిందీ, మరాఠీ చిత్రాలలో నటించిన అదితీరావ్ ఎంచుకునే పాత్రలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయి. సంఖ్యాపరంగా ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా… నటిగా మంచి గుర్తింపునే అదితీరావ్ హైదరీ పొందింది. మరి సిద్ధార్థ్ తో వైవాహిక జీవితానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్ 28తో అదితీరావ్ 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దాంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
