Snake: మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా.. కోర్టులోని రూం నంబర్ 27లోని ఫైళ్ల మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది.
పాము బయటకు రావడంతో సభా కార్యకలాపాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడగా, న్యాయమూర్తి కూడా తన కుర్చీని వదిలేసి లేచి నిలబడ్డారు. పాము బయటకు రాగానే కోర్టు గదిలో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారని ఓ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయమూర్తి కోర్టు విచారణను కాసేపు వాయిదా వేశారు. పాములు పట్టేవారిని పిలిపించి కోర్టు హాలులో పాము కోసం వెతికినా ఫలితం లేకపోయింది.
ఇది కూడా చదవండి: Flaxseeds: అవిసె గింజలు.. ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా..?
Snake: పాత ఫైళ్లను తొలగించి చాలా సేపు వెతికినా కోర్టు గదిలో పాము కనిపించలేదని లాయర్ తెలిపారు. గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వెళ్ళిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన గంట తర్వాత న్యాయమూర్తి కోర్టు విచారణను కొనసాగించారు. కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదని న్యాయవాది తెలిపారు.
ఇంతకు ముందు కూడా పాములు కనిపించాయి
సోమవారం కూడా కోర్టు గది కిటికీపై పాము కనిపించిందని న్యాయవాదులు తెలిపారు. అలాగే రెండు నెలల క్రితం న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కనిపించింది. ఈ కోర్టు గది చుట్టూ చెట్లు, మొక్కలు ఉన్నాయని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని న్యాయవాదులు అంటున్నారు. ఇలాంటి దృశ్యాలు ఆ కోర్టులో సాధారణంగా మారిపోయాయని న్యాయవాదులు చెబుతున్నారు.