Shyam Benegal: హైదరాబాద్ లో జన్మించి, ఇక్కడే విద్యాభాస్యం నెరపి, ముంబై కేంద్రంగా ప్రచార, సినిమా రంగంలో తనదైన ముద్రను వేసిన శ్యామ్ బెనెగల్ మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ తో పాటు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్న శ్యామ్ బెనెగల్ పలువురు నటీనటులను వెండతెరకు పరిచయం చేశారు. ఆయన తొలి చిత్రం ‘అంకుర్’తో నటిగా పరిచయం అయిన షబానా ఆజ్మీకి ఉత్తమనటిగా జాతీయ అవార్డు లభించింది. బెనెగల్ తనకు గురువు అని, నటనలోనే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనెంతో ప్రభావం చూపారని ఆమె అన్నారు.
దేశంలో గొప్ప సినీ దర్శకుడిగానే కాకుండా ఎంతో మేధావిగా బెనెగల్ పేరు తెచ్చుకున్నారని చిరంజీవి అన్నారు. అలానే శేఖర్ కపూర్, మనోజ్ బాజ్ పేయీ, అక్షయ్ కుమార్, కాజోల్, కరణ్ జోహార్, పవన్ కళ్యాణ్ తదితరులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. భారత రాష్ట్రపతి, ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బెనెగల్ మృతికి సంతాపం తెలిపారు. తెలుగువాడైన శ్యామ్ బెనెగల్ తెలుగులో తీసిన ఒకే ఒక్క చిత్రం ‘అనుగ్రహం’లో వాణిశ్రీ, అనంత్ నాగ్, స్మితాపాటిల్, రావుగోపాలరావు తదితరులు నటించారు.