AP Liquor Scam Case

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను కుదిపేస్తోన్న లిక్కర్ స్కామ్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు చూపిస్తోంది. కీలక నిందితులపై ఆధారాలు సేకరించడంలో సిట్ వేగం పెంచింది. తాజా దర్యాప్తులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయానంద రెడ్డి కంపెనీలపై సోదాలు జరిపి మరిన్ని సెన్సేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.

తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో హై వోల్టేజ్ సోదాలు

బుధవారం తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్ నగరాల్లో సిట్ అధికారులు పెద్ద ఎత్తున శోధనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఇషా ఇన్‌ఫ్రా కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వామ్యాన్ని గుర్తించారు. తిరుపతిలో చెవిరెడ్డి అనేక కంపెనీల పేర్లతో లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు దొరికాయి. మోహిత్ రెడ్డి రూ.600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపినట్లు సిట్ గుర్తించగా, విజయానంద రెడ్డి కార్యాలయాల్లోనూ ఈ వ్యాపారానికి సంబంధిత పత్రాలు లభించాయి.

చిత్తూరులో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లు దొరికాయి. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంటి తాళం వేసి ఉండటంతో అధికారులు రాత్రి వరకు అక్కడే పహారా కాసి వెనుదిరిగారు. ఈ సోదాల్లో దొరికిన ఆధారాలను ఇప్పటికే ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌తో పంచుకోవాలని సిట్ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Ration Shop: రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్.. 

కేసు కీలక దశలో

ఇప్పటికే ఈ కేసులో రెండు ఛార్జిషీట్లు ఏసీబీ కోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. జూన్ 19న ప్రాథమిక ఛార్జిషీట్, ఆగస్టు 10న రెండవ ఛార్జిషీట్ సమర్పించారు. ఈ రెండు ఛార్జిషీట్లలో రాజ్ కేసు రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్రలు వివరించబడ్డాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు పలు సార్లు ప్రస్తావనకు వచ్చినా, అధికారికంగా నిందితుడిగా సిట్ పేర్కొనలేదు.

ఏసీబీ కోర్టు ఇప్పటికే రెండు ఛార్జిషీట్లపై 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తగా, సిట్ వాటికి సమాధానాలు సీల్డ్ కవర్‌లో సమర్పించింది.

మూడో ఛార్జిషీట్ ప్రాధాన్యం

ఈ కేసు విచారణ సెప్టెంబర్ చివరినాటికి ముగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులకు 90 రోజుల రిమాండ్ పూర్తవుతుండటంతో బెయిల్ అవకాశాలు రాకుండా ఉండేందుకు సెప్టెంబర్ 15న మూడో అదనపు ఛార్జిషీట్‌ను సమర్పించేందుకు సిట్ సిద్ధమవుతోంది.

ఇప్పటికే 12 మంది నిందితులు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడో ఛార్జిషీట్ దాఖలు కీలక మలుపుగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *