SI Suicide Case: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఆయన ఆత్మహత్య సమయంలో గదిలో ఆయనతోపాటు ఉన్న యువతి బానోతు అనసూర్య(29)ను అరెస్టు చేయడంతో అసలు విషయం తేలింది. ఘటన చోటుచేసుకున్న రోజే ఆమెపై అనుమానం వ్యక్తమైనా, పోలీసుల నుంచి ఆమె తప్పించుకోవడంతో ఇంతకాలం అసలు విషయాన్ని తేల్చలేకపోయారు. తాజాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
SI Suicide Case: ములుగు జిల్లాలోనే ఉన్న మండపాకలోని ఫెర్రాడ్ రిసార్ట్‌లో ఈ నెల 2న అద్దెకు తీసుకున్న గదిలో ఎస్ఐ రుద్రారపు హరీశ్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో అదే గదిలో ఓ యువతి ఉన్న విషయాన్ని ఆలస్యంగా సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ యువతిని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారని తెలిసింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆ యువతి తప్పించుకోగా, పోలీసుల విచారణకు ఆమె ఆచూకీ లభించనేలేదు. దీంతో ఇంతకాలం ఆమెకోసం వెతికారు.
SI Suicide Case: ఏడు నెలల క్రితం ఎస్ఐ సెల్‌కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా ఆయనకు ఓ మహిళ పరిచయం అయింది. ప్రేమ పేరుతో ఎస్ఐకి దగ్గర అయింది. అయితే ఎస్ఐకి తమ కుటుంబ సభ్యులు ఓ సంబంధం కుదర్చడంతో పెళ్లి నిశ్చయమైంది. దీంతో పెళ్లి జరిగే విషయం తెలుసుకున్న ఆ యువతి ఆనాటి నుంచి ఎస్ఐని వేధింపులకు గురిచేయసాగింది. తనను దూరం చేసుకుంటే శారీరకంగా వాడుకొని వదిలేశాడని మీడియాకు, ఉన్నతాధికారులకు చెప్తానని బెదిరించింది. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమయంలోనూ ఆయన పక్కనే ఆ యువతి ఉన్నదని, బ్లాక్‌మెయిల్ కారణంతోనే ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
SI Suicide Case: ఎస్ఐని వేధింపులకు గురి చేసిన యువతి అనసూర్యది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియా తండా. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించారు. అన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేసిన నిందితురాలిని రిమాండ్ చేసినట్టు వెంకటాపురం సీఐ బండారి కుమార్ వెల్లడించారు.

