Shubman Gill: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో, టీమ్ ఇండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ముందుగా శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ ఇవ్వాలన్న బీసీసీఐ నిర్ణయంపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రపంచానికి క్రికెట్ నేర్పిన ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టోర్నమెంట్‌లో భారత్ టెస్ట్ వారసత్వం ముగిసిపోయిందనే స్థాయిలో చర్చలు జరిగాయి. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీం ఇండియా ఆ విమర్శలకు చెక్ పెడుతూ రికార్డుల మోత మోగించింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత టెస్ట్ జట్టు ప్రతిభ కూడా బయటపడింది. విమర్శలు మరియు వ్యాఖ్యల మధ్య, శుభ్‌మాన్ గిల్ నాయకత్వ పరీక్షను చేపట్టడం ద్వారా క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ స్థానాన్ని తాను భర్తీ చేశానన్న సందేశం పంపాడు. 1990లో ఒకసారి ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహం గూచ్ భారత జట్టుపై 456 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ అదే ఇంగ్లీష్ గడ్డపై అదే ఇంగ్లాండ్‌పై 430 పరుగులు చేసి అందర్ని షాక్‌కు గురిచేశాడు. టెస్ట్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు.
అలాన్ బోర్డర్ పేరిట ఉన్న రెండు ఇన్నింగ్స్‌లలో 150 కంటే ఎక్కువ పరుగుల రికార్డును కూడా శుభ్‌మాన్ అధిగమించాడు. అంతే కాదు, ఒకే టెస్ట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇప్పుడు శుభ్‌మాన్ నిలిచాడు. గతంలో, సునీల్ గవాస్కర్ 344 పరుగులు చేశాడు. విజయ్ హజారే, గవాస్కర్, ద్రవిడ్, రహానే, రోహిత్, కోహ్లీ, రిషబ్ తర్వాత గిల్ డబుల్ సెంచరీలు క్రికెట్ ప్రేమికులలో మరింత ఆశల బీజాలను నాటాయి.

