Team India: శ్రీలంక పర్యటనకు ప్రకటించిన జట్టులో భారత క్రికెట్ భవిష్యత్తు చిత్రం కనిపిస్తోంది. టీ20 కెప్టెన్సీ కోసం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లపై ఒక పక్క చర్చ జరుగుతుండగా, రిషబ్ పంత్‌ను కూడా పోటీదారుగా భావించారు. కానీ అనుకోకుండా సూర్యకుమార్ యాదవ్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపించినట్టు కనిపించింది. ఇప్పుడు సెలక్టర్లు శుభ్‌మన్ గిల్‌కు పెద్ద బాధ్యతను అప్పగించి ఆశ్చర్యపరిచారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో గిల్ పెద్ద ప్రమోషన్ పొందాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో శ్రీలంక పర్యటనకు శుభ్‌మన్ ఇప్పుడు టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా, వన్డేల్లో రోహిత్ శర్మ తర్వాత జట్టులో నంబర్-2గా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ కాబోయే కెప్టెన్‌గా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జింబాబ్వే సిరీస్ సందర్భంగా సీనియర్ల గైర్హాజరీతో గిల్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.
ఇదిలా ఉంటె, గిల్‌కి వైస్ కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? అనే విషయాన్ని పరిశిలిస్తే.. దీనికి ఒక కారణం అతని వయస్సు. వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. కొత్త టీ20 కెప్టెన్ సూర్య వయసు 33 ఏళ్లు. కాగా, శుభ్‌మన్ గిల్‌కు ప్రస్తుతం 24 ఏళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ కెప్టెన్సీ పరంగా మరింత పరిణతి చెందే అవకాశం ఉంది. సూర్యకుమార్ – రోహిత్ తర్వాత టీమిండియాను లీడ్ చేసే మంచి ప్లేయర్ అవసరం కాబట్టి సెలక్టర్లు గిల్ వైపు మొగ్గు చూపించినట్టుగా అర్ధం అవుతోంది.

