IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ వేసిన 122 ఓవర్ తొలి బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కాగా.. ఇంగ్లండ్ గడ్డపై మొదటిది కావడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
గిల్ కోత చరిత్ర
ఈ ద్విశతకంతో శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సెనా దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2011లో లార్డ్స్ వేదికగా శ్రీలంక కెప్టెన్‌గా తిలకరత్న దిల్షాన్ 193 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటి వరకు ఆసియా కెప్టెన్ అత్యధిక స్కోర్. ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్ గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పర్యాటక జట్టు కెప్టెన్‌గా కూడా నిలిచాడు.
సచిన్ 26 ఏళ్ల రికార్డ్ బద్దలు
భారత కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రెండో పిన్నవయస్కుడిగా కూడా గిల్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 26 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1999లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 26 ఏళ్ల 189 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో మన్సూల్ అలీ ఖాన్ పటౌడీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ దివంగత క్రికెటర్ 23 ఏళ్ల 39 రోజుల వయసులో ఇంగ్లండ్‌తో ఢిల్లీ వేదికగా 1964లో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
27 ఏళ్ల 260 రోజుల వయసులో విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 2016లో నార్త్ సౌండ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన కెరీర్‌లో 7 డబుల్ సెంచరీలు సాధించడం గమనార్హం.
Also Read: Viral Video: బెంగళూరు కేఫ్‌లో ఘోరం ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వలేదని సిబ్బందిపై దాడి..
ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్‌గా అత్యధిక స్కోర్
టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్(269) నిలిచాడు. ఈ జాబితాలో గిల్ తర్వాత మహమ్మద్ అజారుద్దీన్(179), విరాట్ కోహ్లీ(149), మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(148), శుభ్‌మన్ గిల్(147) ఉన్నారు.
* 231 – శుభ్‌మన్ గిల్, బర్మింగ్‌హామ్, 2025
* 179 – మహ్మద్ అజారుద్దీన్, మాంచెస్టర్, 1990
* 149 – విరాట్ కోహ్లీ, బర్మింగ్‌హామ్, 2018
* 148 – మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, లీడ్స్, 1967
* 147 – శుభ్‌మన్ గిల్, లీడ్స్, 2025
భారత్ 587
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.