Shubhanshu Shukla:అంతరిక్షయాత్రలో భారతదేశం మరో ఘనతను సొంతం చేసుకున్నది. భారత వ్యోమగావి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి మరో ముగ్గురితో కలిసి బయలుదేరడంతో భారత్ అంతరిక్ష యాత్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లనున్న తొలి భారతీయుడిగా, అంతరిక్షంలో అడుగు పెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు.
Shubhanshu Shukla:భారత్ మళ్లీ అంతరిక్షంలోకి వస్తోంది.. జైహింద్.. అంటూ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన చారిత్రక అంతరిక్ష యాత్రకు బయలుదేరే ముందు ఉద్వేగభరితంగా అన్న మాటలు ఇవి. జూన్ 25న భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12.01 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 2.31 గంటలకు ఈడీటీ) అమెరికా ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి అంతరిక్షయాత్ర ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, కొత్త స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో శుక్లా తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు.
Shubhanshu Shukla:ఈ అంతరిక్ష యాత్రలో కెప్టెన్ శుభాంశ్ శుక్లాతోపాటు పోలాండ్‌కు చెందిన స్లావోస్ట్ ఉజ్జాన్క్సి, హంగేరికి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరించనుండగా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ నలుగురు సభ్యుల బృందం రెండు వారాల పాటు మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలను చేపట్టనున్నది. వీటిలో ఏడు ప్రయోగాలను భారతీయ పరిశోధకులు ప్రతిపాదించడం గమనార్హం.
Shubhanshu Shukla:1984 సోవియట్ యూనియన్ మిషన్‌లో భాగంగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆ ఘనతను సాధించనున్న రెండో భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. భారత వాయుసేన పైలెట్ అయిన శుభాంశ్ శుక్లా.. అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు నెలరోజులకు పైగా క్వారంటైన్‌లో ఉన్నారు. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి పైకి వెళ్లిన అపోలో 11 మిషన్‌ను కూడా ఇదే ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించడం విశేషం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, క్రూ డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లనున్నది.