Disha Patani: బాలీవుడ్‌లో ఇటీవల పెరుగుతున్న నేర కార్యకలాపాలు, బెదిరింపులు మరోసారి భయాన్ని సృష్టించాయి. తాజాగా, ప్రముఖ నటి దిశా పటానీ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న తన కుటుంబ నివాసంపై కాల్పులు జరిగాయి. సెప్టెంబర్ 12న, తెల్లవారుజామున సుమారు 3:00 నుండి 4:30 గంటల మధ్య, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దిశా ఇంటి ముందు ఆరు నుంచి ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగినప్పుడు దిశా తల్లిదండ్రులు, సోదరి ఖుష్బూ ఇంట్లోనే ఉన్నారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదు.
ఈ కాల్పుల వెనుక కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖుష్బూ లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల గురించి ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్‌లను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఆగ్రహించిన కొందరు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read: Breaking: రాజకీయాల్లోకి ఎంట్రీ పై బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్‌లకు చెందిన విరేంద్ర చరణ్, మహేంద్ర సరణ్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. “సనాతన ధర్మాన్ని అవమానిస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే” అని వారు ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ కాల్పుల ఘటనపై దిశా తండ్రి, రిటైర్డ్ డీఎస్పీ జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసినవారు ఢిల్లీ-లక్నో హైవే ద్వారా పారిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశా ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటన బాలీవుడ్ లో తీవ్ర ఆందోళన కలిగించింది. గతంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి నటుల ఇళ్లపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.