High Court: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్న జంటకు పోలీసు భద్రత అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు కేవలం ఆ కారణంతో పోలీసు రక్షణ ఇవ్వలేమని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయ కేసర్వానీ అనే మహిళ తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని, భర్తతో కలిసి కోర్టును ఆశ్రయించారు. తాము ప్రేమ పెళ్లి చేసుకున్నామన్న కారణంతో కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వచ్చాయంటూ, భద్రత కల్పించాలని వారు పిటిషన్ వేశారు.
వీరి పిటిషన్‌పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టి, ‘‘జీవితానికి నిజమైన ముప్పు ఉంటేనే పోలీసు భద్రత కల్పించగలమ’’ అని స్పష్టం చేశారు. ‘‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని మాత్రమే చెప్పడం, రక్షణ కోరడానికి సరిపోదు. ఎటువంటి బెదిరింపులు లేకుండా ఈ విధంగా కోర్టును ఆశ్రయించడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డారు.
కోర్టు వ్యాఖ్యానించిన ప్రకారం, ఈ జంటకు ప్రాణహాని లేదా స్వేచ్ఛకు ముప్పు ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు. అంతేకాదు, జంట పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఒక్కచోట, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు మాత్రమే పేర్కొంది.
Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు?!
High Court: ‘‘ప్రేమ పెళ్లి చేసిన తర్వాత ఎదురయ్యే సామాజిక సమస్యలను దంపతులు పరస్పరం అండగా నిలిచి పరిష్కరించుకోవాలి. కోర్టులు రక్షణ ఇచ్చేందుకు మాత్రమే ఉండవు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌లో ప్రస్తావించిన కారణాలు సరిపోవని న్యాయస్థానం భావించి, దాన్ని కొట్టివేసింది.

