Shashi Tharoor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను గమనించి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారానికి తనను ఆహ్వానించలేదని, అందువల్ల తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఆయన తెలిపారు. బీహార్లో ఎన్డీయే కూటమి 200 స్థానాల వరకు భారీ ఆధిక్యంతో ముందంజలో ఉండగా, మహాఘట్బంధన్ 40 స్థానాల కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతున్న తరుణంలో థరూర్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తనపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉందన్న వార్తలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఓటమి కారణాలను పార్టీ సంపూర్ణంగా విశ్లేషించాలని, లోపాల్ని క్షుణ్ణంగా గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు.
ఎన్డీయే భారీ విజయానికి దారితీసిన అంశాలు ఏంటో కూడా కూటమి స్థాయిలో పరిశీలించడం అత్యంత ముఖ్యం అని థరూర్ చెప్పారు.

