Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం సాయంత్రం సంభవించిన తీవ్రమైన కారు పేలుడు ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి పైగా మరణించగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రత, నిందితులకు ఉగ్రవాద మాడ్యూల్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించింది.
ఏ రాష్ట్రాల్లో హై అలర్ట్?
ఢిల్లీతో పాటు సరిహద్దు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (UP), రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ,పంజాబ్ ,హర్యానా ,జమ్ము కశ్మీర్, బీహార్..ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతా దళాలు నిఘాను పెంచాయి.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఏ ఒక్కడిని వదిలిపెట్టం.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రత
కేంద్రం ఆదేశాల మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో (Airports On Alert) భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. రాబోయే మూడు రోజులపాటు విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ కొనసాగనుంది. ప్రతి ఒక్క ప్రయాణికుడినీ క్లిష్టంగా తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ పార్కింగ్‌పైనా (Airport Parking) ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
పేలుడు వివరాలు మరియు దర్యాప్తు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో, సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు సంబంధించిన శకలాలను ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL), ఎన్‌ఎస్‌జీ (NSG) బృందాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటివరకు 10 మందికి పైగా మరణించగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడుకు సంబంధించిన కారుకు పుల్వామాతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన అనుమానితుడు డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఈ దాడికి పాల్పడినట్లుగా సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు.
ఎయిర్‌పోర్ట్స్ మాత్రమే కాకుండా బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలూ, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు దేశ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా దళాలు పగలు, రాత్రి నిఘాను కొనసాగిస్తున్నాయి.

