IPS Officer Suicide: హర్యాణా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చండీగఢ్‌లోని సెక్టార్–11లో జరిగింది.
చండీగఢ్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కన్వర్‌దీప్ కౌర్ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పురాన్ కుమార్ తన నివాసంలో కాల్పులు జరిపి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Baahubali The Epic: భారీ రన్‌టైమ్‌తో రాబోతున్న బాహుబలి: ది ఎపిక్
ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. పురాన్ కుమార్ ఆత్మహత్యకు గల నిజమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆయన సోమవారం తన గన్‌మ్యాన్ వద్ద నుంచి సర్వీస్ రివాల్వర్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై చండీగఢ్ పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు.
పురాన్ కుమార్ ప్రస్తుతం హర్యాణా రాష్ట్రంలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP)గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనను రోహ్‌తక్‌లోని సునారియా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC)లో నియమించారు. ఒక ఉన్నతాధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్యాణా పోలీస్ వ్యవస్థలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
పురాన్ కుమార్ భార్య అమ్నీత్ పి. కుమార్ హర్యాణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె ప్రస్తుతం హర్యాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని అధికారిక బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ ఘటన జరిగే సమయానికి ఆమె ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఆమె రేపు సాయంత్రానికి భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.
హర్యాణాలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పురాన్ కుమార్ మృతితో రాష్ట్ర పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.