Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.
స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.
Also Read: Siddipet: నా భార్యను గెలిపిస్తే ఫ్రీగా కటింగ్ , షేవింగ్!
స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.

